
దుబ్బాక ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు పాలకులకు కనువిప్పు కావాలని బీజేపీ అభ్యర్థిగా గెలుపొందిన ఎన్ రఘునందన్ చెప్పారు. అరాచక పాలనకు వ్యతిరేకంగా సిద్దిపేట గడ్డ ప్రజలిచ్చిన ఈ తీర్పు ప్రగతి భవన్ దాకా పోవాలని స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్ చదివిన గడ్డ మీద నుంచి వచ్చిన రీసౌండే ఈ విజయమని పేర్కొన్నారు. వ్యవస్థల ద్వారా పెత్తనం చేస్తూ వ్యక్తులను హింసించాలని చూస్తే చప్పుడు ఇలానే వస్తుందని హెచ్చరించారు.
అక్రమ కేసులు పెట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం తమను వేధించిందని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న నియంతృత్వ, నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని పిలుపు నిచ్చారు. తన చివర శ్వాస వరకు కూడా దుబ్బాక ప్రజలకు సేవ చేస్తానని రఘునందన్ రావు తెలిపారు. తన గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు విక్టరీ సాధించారు. టీఆర్ఎస్ అభ్యర్థి సుజాతపై 1118 ఓట్ల మెజార్టీతో రఘునందన్‌రావు గెలుపొందారు. తొలి రౌండ్ నుంచి కమలం-కారు మధ్య హోరాహోరీగా.. నువ్వానేనా అన్నట్టుగా సాగినా చివరాకరికి కమలాన్నే విజయం వరించింది.
దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 198807 ఓట్లు ఉండగా.. 164192 ఓట్లు పోలయ్యాయి. అయితే వీటిలో 162516 ఓట్లను లెక్కించారు. మిగిలినవి ఈవీఎంలలో ఉండిపోయాయి. 23 రౌండ్ల కౌంటింగ్ పూర్తయిన తర్వాత టీఆర్ఎస్‌కు 61302 ఓట్లు, బీజేపీకి 62772 ఓట్లు, కాంగ్రెస్‌కు 21819 ఓట్లు పోలయైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
ఇక ఈ ఎన్నికల్లో నోటాకు 552 ఓట్లు రావడం విశేషం. మొత్తం 23 మంది అభ్యర్థులు దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేయగా 11 మంది అభ్యర్థులకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.
రఘునందన్‌రావు 1968లో భగవంతరావు, భారతి దంపతులకు సిద్దిపేటలో జన్మించారు. డిగ్రీ వరకు సిద్దిపేటలోనే చదువుకున్న ఆయన ఒక ప్రముఖ దినపత్రిక విలేకరిగా తన కెరీర్ మొదలుపెట్టారు. జర్నలిస్టుగా కొనసాగుతున్న సమయంలోనే వివిధ రాజకీయ, సామాజిక అంశాలపై పట్టు సాధించారు.
ఈ క్రమంలోనే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ పూర్తి చేసి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బార్ అసోసియేషన్ లో అడ్వకేట్ గా చేరారు. 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ను స్థాపించడంతో రఘునందన్ ఆ పార్టీలో చేరి ఉమ్మడి మెదక్ జిల్లాలో కీలక నేతగా ఎదిగారు. టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యునిగా, ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు.
2009లో టీఆర్ఎస్ తరఫున స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసి కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారు. పొలిట్‌బ్యూరో సభ్యునిగా ఉండి, టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారనే ఆరోపణలతో 2013లో టీఆర్ఎస్ హైకమాండ్ రఘునందన్‌రావును పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.
దీంతో బీజేపీలో చేరిన రఘునందన్ రావు.. తన సొంత నియోజకవర్గం దుబ్బాకలో బీజేపీని బలోపేతం చేసే దిశగా పని చేశారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో మెదక్ లోక్‌సభ స్థానానికి బీజేపీ తరపున బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు.
సొంత ప్రాంతంలో పలుమార్లు ఓటములు, అవమానాలు ఎదురైనప్పటికీ రఘునందన్‌రావు ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఎప్పటికప్పుడు బీజేపీ కేడర్‌కు అండగా ఉంటూ వచ్చారు. రఘునందన్‌రావుకు మంచి వక్తగా గుర్తింపు ఉంది. వివిధ వేదికలపై, ముఖ్యంగా టీవీ డిబేట్స్‌లో వివిధ అంశాలపై తన అభిప్రాయాలను బలంగా వినిపించేవారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక చర్యలను తన పదునైన మాటలతో ఎండగట్టడంలో దిట్టగా పేరొందారు.
More Stories
తెలంగాణ సీఎస్‌గా కే రామకృష్ణారావు
కాంగ్రెస్ ప్రభుత్వానికి కమీషన్ల పై ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదు
తెలంగాణలో 230 మంది పాకిస్తానీయులు గుర్తింపు