
కుండపోత వర్షాలు, భారీ వరదలకు అతలాకుతలమైన హైదరాబాద్ పేదలకు సాయం అందించడం కోసం మున్సిపల్ శాఖకు ప్రభుత్వం రూ. 550 కోట్లు తక్షణం విడుదల చేస్తుందని సీఎం కేసీఆర్ వెల్లడించారు. వరద నీటి ప్రభావానికి గురైన హైదరాబాద్ నగరంలోని ప్రతి ఇంటికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు.
ఈ ఆర్థిక సాయం మంగళవారం ఉదయం నుంచే ప్రారంభిస్తామని చెప్పారు. వర్షాలు, వరదల వల్ల ఇల్లు పూర్తిగా కూలిపోయిన వారికి రూ. లక్ష చొప్పున, పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు కేసీఆర్ తెలిపారు.
భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఎన్నో కష్టనష్టాలకు గురయ్యారని, వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు.
వరద నీటిలో మునిగిన ప్రాంతాల్లోని ఇళ్లల్లో నివసిస్తున్న వారు ఎంతో నష్టపోయారని, ఇళ్లలోకి నీళ్లు రావడం వల్ల బియ్యం సహా ఇతర ఆహార పదార్థాలు తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. దెబ్బతిన్న రహదారులు, ఇతర మౌలిక వసతుల కల్పనకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి, మళ్లీ మమూలు జీవన పరిస్థితులు నెలకొనేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు.
గడిచిన వందేళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షం హైదరాబాద్ నగరంలో కురిసింది. ప్రజలు అనేక కష్ట, నష్టాలకు గురయ్యారు. ముఖ్యంగా నిరుపేదలు, బస్తీలలో ఉండే వారు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు ఎక్కువ కష్టాల పాలయ్యారు. వారిని ఆదుకోవడం ప్రభుత్వ ప్రాథమిక విధి అని సీఎం పేర్కొన్నారు.
నగరంలో 200-250 బృందాలను ఏర్పాటు చేసి, అన్ని చోట్లా ఆర్థిక సాయం అందించే కార్యక్రమం పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు.
హైదరాబాద్ నగర పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాల కలెక్టర్లు, వారి బృందాలు వెంటనే రంగంలోకి దిగి మంగళవారం ఉదయం నుంచే ఆర్థిక సాయం అందించే కార్యక్రమం చేపట్టాలని సీఎం ఆదేశించారు.
కాగా, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదల సహాయ చర్యలకు తమ వంతు అండగా నిలిచేందుకు తమిళనాడు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆ రాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ.10 కోట్లు విరాళాన్ని ప్రకటించారు తమిళనాడు సీఎం ఎడిప్పాడి పళనిస్వామి. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు.
More Stories
మంత్రి మల్లారెడ్డిని బర్తరఫ్ చేయాలి
టీఎస్పీఎస్సీ బోర్డు ప్రక్షాళనకు పట్టించుకోని ప్రభుత్వం
బీఆర్ఎస్ ఎంపీ ఫౌండేషన్‌కు భూమి కేటాయింపును రద్దు!