దుబ్బాకలో పోటీలో 23 మంది 

దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించిన కీలక ఘట్టం ముగిసింది. నామినేషన్ల ఉప సంహరణ గడువు సోమవారంతో ముగియగా, మొత్తం 23 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 46 మంది అభ్యర్థులు మొత్తం 103 నామినేషన్లు దాఖలు చేశారని, 12 మంది నామినేషన్లను తిరస్కరించినట్లు తెలిపారు. 

మిగిలిన 91 నామినేషన్లలో  34 మంది అభ్యర్థులు మిగలగా సోమవారం సాయంత్రం నామినేషన్ల ఉపసంహరణ గడువు వరకు 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో చివరకు పోటీలో 23 మంది అభ్యర్థులు నిలిచారని రిటర్నింగ్‌ అధికారి చెన్నయ్య తెలిపారు. నవంబర్ 3న దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. నవంబర్ 10న ఫలితం వెల్లడికానుంది.

 దుబ్బాక టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. రామలింగారెడ్డి భార్య సుజాతకు టీఆర్‌ఎస్ దుబ్బాక ఉప ఎన్నిక టికెట్‌ను కేటాయించగా, ప్రతిపక్ష కాంగ్రెస్ ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాసరెడ్డిని పార్టీలోకి చేర్చుకుని మరీ బరిలో నిలిపింది. బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ బరిలో నిలిచారు.