కోలుకోక ముందే హైదరాబాద్ లో మళ్ళి భారీ వర్షం 

మొన్నటి వానలకే ఆగమాగమైన హైదరాబాద్​ను మళ్లీ భారీ వర్షం ముంచెత్తింది. శనివారం సాయంత్రం మొదలై అర్ధరాత్రి వరకూ దంచికొట్టింది. దీంతో ముంపు ప్రాంతాల్లోకి మరోసారి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. రోడ్లన్నీ  మోకాళ్ల లోతు నీళ్లతో నిండిపోయాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్​ జామ్​లు ఏర్పడ్డాయి. 

మంగళవారం కురిసిన కుండపోత వానతో చెరువుల కట్టలు తెగి, నాలాలు ఉప్పొంగి.. వందలాది కాలనీల్లోకి వరద నీరు చేరింది. ఇప్పటికీ అనేక కాలనీల్లో ఆ నీరు పోలేదు. కొన్ని చోట్ల వరద తగ్గినా.. బురద పేరుకుపోవడంతో దాన్ని తొలగించే పనుల్లో జనం నిమగ్నమయ్యారు. ఇంతలోనే వాన అందుకోవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు వణికిపోతున్నారు. 

 వివిధ కార్యాలయాల నుంచి తమ తమ గమ్యస్థానాలకు చేరుకునే ఉద్యోగులు తడుస్తూనే ఇళ్లకు వెళ్తున్నారు. నాలాలు పొంగాయి. రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. ఇప్పటికే వరదలో ఉన్న ప్రాంతాల్లో వరద మరింత పెరిగింది.  ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు విజయవాడ రహదారిపై వర్షపు నీరు చేరడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి.

మొన్నటిలాగానే ఇప్పుడు కూడా అధికారులు ముందస్తుగా అలర్ట్​ చేయకపోవడంతో లోతట్టు ప్రాంతాలవాళ్లు  బిక్కుబిక్కుమంటూ పరుగులు తీయాల్సి వచ్చింది. ఇప్పటికే చెరువులు ఎఫ్​టీఎల్​ లెవెల్​కి పూర్తిగా నిండిపోయాయి. మళ్లీ భారీ వర్షం వల్ల చెరువులు పొంగిపొర్లుతున్నాయి. 

రాత్రి 11 గంటల వరకు ఘట్‌కేసర్‌లో 18.1 సెంటీమీటర్లు, సరూర్​నగర్‌లో 16.95 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చాలా ఏరియాల్లో 10 సెంటీమీటర్లకు పైగానే వర్షపాతం నమోదైంది. వర్షం కారణంగా గోల్నాక కొత్తవంతెనపై భారీగా వాహనాలు నిలిచాయి. ట్రాఫిక్ పోలీసులు మూసారాంబాగ్ వంతెనపై రాకపోకలను నిషేధించారు. వంతెనపై నుంచి వాహనాల దారి మళ్లింపుతో రద్దీ పెరిగింది.

ఎడతెరపి లేకుండా కురిసిన వాన ప్రభావం చారిత్రాత్మక గొల్కొండ కోటపైనా పడింది. భాగ్యనగరంలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోల్కొండ కోటలోని ఓ గోడ నేలమట్టమైంది. శ్రీజగదాంబికా అమ్మవారి ముందున్న దాదాపు 20 అడుగుల ఎత్తైన గోడ కూలిపోయింది. పది నెలల క్రితమే ఈ గోడపైన ధ్వంసమైన బురుజులను పురావస్తు శాఖాధికారులు మరమ్మత్తులు చేయించారు. 

కానీ ప్రహరీగోడ కింది భాగంలో అప్పటికే పగుళ్లు వచ్చినప్పటికీ అధికారులు పట్టించుకోక పోవడంతో వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆ గోడ పూర్తిగా తడిసి కుప్పకూలిపోయింది. గోడ కూలిన సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడం పెను ప్రమాదం తప్పింది. నగరంలో శిథిలావస్థకు చేరిన భవనాలు, ఇళ్ల సమీపంలో ఉన్న ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.