కల్వకుర్తి వద్ద బీజేపీ నేత‌ డీకే అరుణ అరెస్ట్

వనపర్తి జిల్లా పెబ్బేరు వద్ద బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి ‌ డీకే అరుణను పోలీసులు అరెస్ట్ చేశారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పరిశీలించేందుకు వెళ్లిన ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దీంతో పోలీసులు, బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. 
 
పోలీసులు అడ్డుకోవడంతో అరుణ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కారు దిగి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లే ప్రయత్నం చేశారు. మంత్రులను అనుమతించిన పోలీసులు తమను ఎందుకు అనుమతించడం లేదని మండిపడ్డారు.   
 
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పలువురు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, ఏఐ సీసీ కార్యదర్శి సంపత్, మాజీ ఎంపీ మల్లు రవిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ఉప్పునుంతల పోలీస్ స్టేషన్ కు తరలించారు. 
 
ఉప్పునుంతల పోలీస్ స్టేషన్ వద్దకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు తరలి వచ్చారు. పోలీసులు అరెస్టు చేసిన సమయంలో ఎంపీ రేవంత్ రెడ్డి కాలికి గాయాలయ్యాయి. 
 
సర్జిపూర్ గోడ కూలడంతో కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి చెందిన ఐదు మోటార్లు నీటముగినిపోయాయి. దీంతో ఘటనాస్థలిని పరిశీలించేందుకు విపక్షనేతలు ప్రయత్నించారు.