రాజశేఖర్‌, జీవితలకు  కరోనా  

ప్రముఖ టాలీవుడ్‌ జంట రాజశేఖర్‌, జీవిత కరోనా బారిన పడ్డారు. వారం రోజుల క్రితమే కరోనా సోకగా ఆలస్యంగా ఈ విషయం బయటకు వచ్చింది. రాజశేఖర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, జీవిత క్వారెంటైన్‌లో ఉన్నారు.
 
 ప్రస్తుతం రాజశేఖర్ ప్రముఖ దర్శకుడు నీలకంఠ సినిమాలో నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. దీనికి సంబంధించిన షూటింగ్‌ మొదలు కావాల్సి ఉంది. అంతలో ఆయనకు కరోనా సోకింది. 
 
ఇప్పటికే ప్రముఖ దర్శకుడు రాజమౌళి, నటుడు నాగబాబు, సంగీత దర్శకుడు కీరవాణి, నటి తమన్నా కోవిడ్‌-19 బారిన పడి కోలుకున్న సంగతి విదితమే.
 
ఇలా ఉండగా, తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,451 కొత్త కొవిడ్ కేసులు, 9 మరణాలు నమోదయ్యాయి. అదే సమయంలో 1,983 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,20,675కి చేరాయి. ఈ మహమ్మారి బారినపడి ఇప్పటివరకు 1,265 మంది మృతి చెందారు. 
 
హైదరాబాద్ లో 235 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 65,724 కేసులు నమోదు కాగా, కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు.