ఇటీవల హైదరాబాద్ లో వరదల కారణంగా మృతి చెందిన వారందరి కుటుంబాలకు రూ 20 లక్షలు చొప్పున పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు.
భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులకు గురైన ప్రజలను నగరంలో పరామర్శిస్తూ ఇంకా వారిలో అనేకమంది విద్యుత్, తాగు నీరు, ఆహారం లేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాలని కోరారు. బైరామల్ గూడా ప్రాంతంలో కేటీఆర్ ను ప్రశ్నించిన కొంత మంది దళిత మహిళలు, స్థానిక ప్రజలను పోలీసులతో హింసించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి అండగా ఉంటూ అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులు అందరిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న బైరామల్ గూడ చెరువు ప్రస్తుతం 2 ఎకరాలే ఉందని అంటూ అధికార టీఆర్ఎస్ కు చెందిన కొంతమంది గుంటనక్కలు చెరువుల ఆక్రమణలకు పాల్పడడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని సంజయ్ విమర్శించారు.
గత ఆరేళ్లలో హైదరాబాద్ లో వందలాది చెరువులు, నాలాలు ఆక్రమణకు గురయ్యాయని ధ్వజమెత్తారు. దీని పర్యవసానమే భారీ వరదలని అంటూ దీనికి టీఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ఆక్రమణలకు గురైన చెరువుల గురించి టీఆర్ఎస్ సర్కారు కనీసం ఆలోచించడం లేదని మండిపడ్డారు.
చెరువులను కబ్జాచేసిన గుంటనక్కలెవరో విచారణ చేపట్టాలని సంజయ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం వరదలను ఎదుర్కొనే కార్యాచరణ కూడా చేపట్టకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. భారీ వర్షాల కారణంగా కాలనీలన్నీ మూసీ నదిలా మారాయని అంటూ 8వేల కార్లు నీటమునిగాయని తెలిపారు.
హైదరాబాద్ కోసం రూ 5,000 కోట్ల కేంద్ర సహాయం కోరుతున్న కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం నుండి కేవలం రూ 5 కోట్లు ప్రకటించి చేతులు దులుపుకోవడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. అన్నీ కేంద్రమే ఇచ్చినప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎందుకున్నారని ప్రశ్నించారు.
More Stories
మోదీ పుట్టిన రోజుకు బిజెపి కార్యకర్తలకు `ప్రజాస్వామ్య తోఫా’
నల్గొండ బిఆర్ఎస్ కార్యాలయం కూల్చివేయాలని హైకోర్టు ఆదేశం
జానీ మాస్టర్ పై పోక్సో కేసు