మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అరెస్ట్..14 రోజుల రిమాండ్‌

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అరెస్ట్..14 రోజుల రిమాండ్‌
సింగరేణి కార్యాలయాలు, రైలు పట్టాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీఆర్​ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను హైదరాబాద్‌లో పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఈ క్రమంలో బీఆర్​ఎస్​ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌, నాంపల్లి పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  అరెస్ట్‌ చేసిన పోలీసులు నాంపల్లి ఠాణాకు తరలించి సుమారు 7 గంటలపాటు విచారణ చేపట్టారు. ఈ నెల 26న సింగరేణి సంస్థ ఇన్‌స్పెక్టర్‌ ఆనంద్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
పోలీస్‌ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌ వాంగ్మూలాన్ని సైతం రికార్డు చేశారు. నారాయణగూడలో మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరుచగా 14 రోజులు జ్యుడీషియల్‌ రిమాండ్‌కు విధించారు. డీసీపీ శిల్పవల్లి సమక్షంలో పోలీసు అధికారులు బాల్క సుమన్‌ను విచారించారు. బాల్క సుమన్‌ను అరెస్ట్‌ చేసేందుకు శనివారం మధ్యాహ్నం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పెద్దసంఖ్యలో తెలంగాణ భవన్‌కు చేరుకొని మోహరించారు. సమాచారం తెలిసి బీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
పోలీసులు బలవంతంగా భవన్‌ గేటును తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు.  వారిని బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నాయకులు నిలువరించారు. నాలుగురోజులుగా మిన్నకుండి కోర్టుకు సెలవు రోజుల్లో ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారని ప్రశ్నించారు. కాసేపటి తర్వాత బాల్క సుమన్‌ బయటికి రాగా పోలీసులు అరెస్టు చేశారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులకు సహకరిస్తానని బాల్క సుమన్‌  బయటకు రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలు, సింగరేణిలో జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నించినందుకే తనపై రేవంత్‌రెడ్డి సర్కార్‌ కక్ష సాధిస్తున్నదని బాల్క సుమన్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. అరెస్ట్‌కు ముందు తెలంగాణ భవన్‌ వద్ద మీడియాతో మాట్లాడుతూ  ‘నేను 2014లో ఎంపీగా, 2018లో ఎమ్మెల్యేగా సింగరేణి కార్మికుల ఓట్లతోనే గెలిచాను. ఈ క్రమంలో కార్మికులకు కాంగ్రెస్‌ సర్కార్‌ చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించాను. కానీ ప్రభుత్వ పెద్దలు సహనం కోల్పోయి ప్రశ్నించినందుకు నా గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారు. నన్ను అరెస్ట్‌ చేసి పైశాచికానందం పొందుతున్నారు’ అని ధ్వజమెత్తారు.