52 కాలేజీలు హైడ్రా కమిషనర్ సంతకాల ఫోర్జరీ!

52 కాలేజీలు హైడ్రా కమిషనర్ సంతకాల ఫోర్జరీ!
అడ్డదారిలో ఫైర్ ఎన్‌ఓసీలను తీసుకునేందుకు హైడ్రా కమిషనర్ సంతకాలను ఫోర్జరీ చేసిన విద్యాసంస్థల బాగోతం బట్టబయలైంది.52 కళాశాలలుహైడ్రా కమిషనర్ సంతకాలను ఫోర్జరీ చేసి ఫైర్ ఎన్‌ఓసీలను విద్యాశాఖకు సమర్పించినట్లు విచారణలో తేలింది. సదరు కళాశాలలపై లేక్ పోలీసు స్టేషన్‌లో హైడ్రా ఫిర్యాదు చేసింది.  ఈ విద్యాసంస్థల గుర్తింపులను రద్దు చేయాలని విద్యాశాఖ ఉన్నతస్థాయి అధికారులకు హైడ్రా ఫిర్యాదు చేసినట్టు అధికారులు వెల్లడించారు.
ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్ అర్బన్ రీజియన్(క్యూర్) పరిధిలోని అన్ని కళాశాలలు సమర్పించిన ఫైర్ ఎన్‌ఓసీలపై దృష్టిసారించి విచారణ చేపట్టగా 52 కళాశాలలు ఫోర్జరీ సంతకాలతో సృష్టించిన ఎన్‌ఓసీలను సమర్పించాయనేది తేలిపోయింది.  నగరం నడిబొడ్డున ఉన్న హిమాయత్‌సగర్‌లోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాల ఫైర్ ఎన్‌ఓసీని సమర్పించిం ది.
దీనిని విద్యాశాఖ అధికారులు అనుమానించకుండా స్వీకరించడంతో మరిన్ని కళాశాలలు అదే బాటపట్టి అవి కూడా ఫోర్జరీ సంతకాల సర్టిఫికెట్లు విద్యాశాఖకు సమర్పించినట్లు తెలుస్తోంది.  హైందవీ కళాశాల సమర్పించిన ఫైర్ ఎన్‌ఓసీని అనుమానించిన అధికారులు ఆ సర్టిఫికెట్‌ను హైడ్రాకు పంపించి ఇది మీరు జారీచేసిన ఫైర్ ఎన్‌ఓసీయేనా? అని పేర్కొనగా హైడ్రా అధికారులు దానిని క్షుణ్ణంగా పరిశీలించడంతో అది ఫోర్జరీ సంతకంతో సృష్టించిన నకిలీ సర్టిఫికెట్ అని తేలింది.
దీంతో ఇటీవల ఎన్ని ఫైర్ ఎన్‌ఓసీలు అందాయి? వాటినిపంపించాలని హైడ్రా కోరడంతో విద్యాశాఖఅధికారులు 8 ఫైర్ ఎన్‌ఓసీలను మొదటగా పంపించారు.  అవన్నీ ఫోర్జరీ సంతకాలతో సృష్టించిన నకిలీ సర్టిఫికెట్స్ అని హైడ్రా తేల్చేసింది. వెంటనే లేక్ పోలీసు స్టేషన్‌లో సంతకాన్ని ఫోర్జరీచేసి ఫైర్ ఎన్‌ఓసీలను సమర్పించిన 8 కళాశాలలైన హైందవి, రిసోనెన్స్, ప్రియాంక, మథర్స్ గర్ల్, శ్రీచంద్ర, న్యూ ఎరా, షాహీన్, వశిష్ఠ జూనియర్ కళాశాలలపై హైడ్రా ఫిర్యాదు చేసింది. వాస్తవానికి ప్రైవేట్ జూనియర్ కళాశాలల భవనాలన్నీ కూడా కమర్షియల్ భవనాలు. 
 
ఇవి భవన నిర్మాణ నియమాలను ఉల్లంఘించి నిర్మించినవే. దాదాపు 95శాతం భవనాలన్నీ అక్రమ నిర్మాణాలు కావడంతో వీటికి ఫైర్ ఎన్‌ఓసీ మంజూరు చేయడానికి నియమ నిబంధనలు ససేమిరా అంటాయి. కళాశాలను నడవాలంటే విద్యాశాఖ అనుమతికోసం ఫైర్ ఎన్‌ఓసీ తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే ఓ ప్రైవేట్ కళాశాల యజమాని ఓ కన్సల్టెన్సీని కలవడంతో  .  నకిలీ ఫైర్ ఎన్‌ఓసీ సమర్పించే సలహా ఇవ్వడంతో అప్పటి నుండి పలువురు అనుసరించడం ప్రారంభించారు.