స్వదేశీ పరిజ్ఞానంతో 350 కిలోల థ్రస్ట్-క్లాస్ ఎక్స్‌పెండబుల్ టర్బోజెట్ ఇంజిన్‌ను పరిశోధకులు విజయవంతంగా అభివృద్ధి చేశారు. బెంగళూరులోని డీఆర్డీవోకు అనుబంధంగా పనిచేస్తున్న ‘గ్యాస్ టర్బైన్ రిసెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్’ (జీటీఆర్‌ఈ) ఈ ఇంజిన్‌ను డిజైన్ చేయగా, హైదరాబాద్‌కు చెందిన ‘ఆజాద్ ఇంజినీరింగ్’ సంస్థ ఇండస్ట్రీ పార్ట్‌నర్‌గా దీనిని నిర్మించి, అసెంబుల్ చేసింది.
కేవలం 24 నెలల స్వల్ప వ్యవధిలోనే ఆజాద్ ఇంజినీరింగ్ ప్రతినిధులు ఈ ప్రాజెక్టును పూర్తి చేసి గత నెల 22న ఈ ఇంజిన్‌ను డీఆర్‌డీవో ఉన్నతాధికారులకు అందజేశారు. శత్రు దేశాలపై ప్రయోగించే క్రూయిజ్ క్షిపణులు, యూఏవీలు, డ్రోన్లు లక్ష్యాలను చేధించాలంటే టర్బో జెట్ పవర్ ఉండాలి. దీనికి థ్రస్ట్-క్లాస్ ఎక్స్‌పెండబుల్ టర్బోజెట్ ఇంజిన్ అవసరం.
అత్యంత సంక్లిష్టమైన ఈ సాంకేతికత ప్రస్తుతం ప్రపంచంలోని కొన్ని దేశాల వద్ద మాత్రమే ఉంది. దీంతో ఈ సాంకేతికత కోసం మొన్నటివరకూ భారత్ కూడా విదేశాలపైనే ఆధారపడాల్సి వచ్చింది. అయితే, టర్బోజెట్ ఇంజిన్ తయారీలో భారత్ తాజాగా ఈ ఘనత సాధించడం ఏరోస్పేస్ ప్రొపల్షన్ రంగంలో స్వయం సమృద్ధికి నాందిగా రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు.
టర్బో జెట్ ఇంజిన్ డిజైన్‌ను డీఆర్డీవో శాస్త్రవేత్తలు రూపొందించినప్పటికీ, ఇంజిన్ తయారీ, అసెంబుల్‌ను మాత్రం హైదరాబాద్‌కు చెందిన ఆజాద్ ఇంజినీరింగ్ కంపెనీ పూర్తి చేసింది. 2008లో ప్రారంభమైన ఈ కంపెనీ నగర శివారుల్లో పలు తయారీ యూనిట్లను ప్రారంభించింది. సిద్దిపేట జిల్లా ములుగు మండలం తునికి బొల్లారం టీజీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్‌లో గత ఏప్రిల్‌లో ప్రారంభించిన ఆజాద్ కంపెనీ కొత్త తయారీ యూనిట్‌కు 2021లో శంకుస్థాపన జరిగింది.

More Stories
పార్టీ కంటే అభ్యర్థే ప్రధానం అంటున్న తెలంగాణ పట్టభద్రులు
వందేమాతరం అవమానించిన కాంగ్రెస్.. బీజేవైఎం నిరసన
తెలంగాణ ఎస్ఐఆర్ ప్రక్రియలో 92 లక్షల మందికి నోటీసులు