కదం తొక్కిన బీజేపీ మహిళా మోర్చా ‘మహిళా శక్తి స్కూటీ ర్యాలీ’

కదం తొక్కిన బీజేపీ మహిళా మోర్చా ‘మహిళా శక్తి స్కూటీ ర్యాలీ’
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ తెలంగాణ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డా.మేకల శిల్పారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ‘మహిళా శక్తి స్కూటీ ర్యాలీ’ ఘనంగా జరిగింది. వేలాది మంది మహిళలు భాగ్యనగర వీధుల్లో కదం తొక్కారు. చార్మినార్ వద్దగల ప్రసిద్ధ భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభమైన ఈ భారీ స్కూటీ ర్యాలీ, అసెంబ్లీ ప్రాంగణంలోని ఉక్కుమనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహం వరకు ఉత్సాహభరితంగా సాగింది. 

ఈ ర్యాలీలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.  రాంచందర్ రావు మాట్లాడుతూ రజాకార్ల వారసులైన ఎంఐఎంకు తలొగ్గి కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు తెలంగాణ విమోచన చరిత్రను మరుగున పడేసే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు. నాటి పోరాటాలు, త్యాగాలను నేటి నవతరం (జెన్-జీ, జెన్-ఆల్ఫా) తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, ప్రతి ఇంటికీ ఈ వాస్తవ చరిత్ర చేరాలని ఆయన స్పష్టం చేశారు.  

సెప్టెంబర్ 17ను అధికారికంగా ‘తెలంగాణ విమోచన దినోత్సవం’గా నిర్వహించాలని బిజెపి దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నప్పటికీ, ఎంఐఎం భయం మరియు ఓటు బ్యాంక్ రాజకీయాల కారణంగానే గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు దీనిని నిరాకరిస్తున్నాయని మండిపడ్డారు. నిజాం, రజాకార్ల పాలనలో తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా మహిళలు అంతులేని క్రూర హింసను ఎదుర్కొన్నారని రామచందర్ రావు తెలిపారు.

అంతటి అణచివేత ఉన్నప్పటికీ, తెలంగాణ బిడ్డలు ఎంతో ధైర్యంతో నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తుచేశారు.”తెలంగాణ ప్రజల అసాధారణ ధైర్యం, త్యాగాలు చరిత్రలో నిలిచిపోయేవి అయినప్పటికీ, గత ప్రభుత్వాలు వారి ఘనమైన వారసత్వాన్ని గౌరవించడంలో, వారి పోరాట గాథను సమాజానికి తెలియజేయడంలో పూర్తిగా విఫలమయ్యాయి” అని ఆయన ధ్వజమెత్తారు.  తెలంగాణ విమోచన పోరాట చరిత్రను, అమరుల త్యాగాలను ఎందుకు విస్మరిస్తున్నారని ప్రశ్నిస్తూ “ఎందుకు విస్మరిస్తున్నారు? రజాకార్ల వారసులైన ఎంఐఎంకు భయపడే కదా!” అని ప్రశ్నించారు.

కిషన్ రెడ్డి మాట్లాడుతూ నిజాం సైన్యం, రజాకార్లు గ్రామాలపై పడి సాగించిన హత్యలు, అత్యాచారాలు, దోపిడీలను తెలంగాణ మహిళలు అద్భుత ధైర్యంతో ఎదుర్కొన్నారని గుర్తుచేశారు.  నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల దురాగతాలకు వ్యతిరేకంగా తెలంగాణ ఆడబిడ్డలు రోకలిబండలు, కారపు ముద్దలతో ధైర్యంగా పోరాడి రజాకార్లను గ్రామ సరిహద్దుల దాకా తరిమికొట్టిన చరిత్ర మనదని తెలిపారు.

నాటి హైదరాబాద్ సంస్థానంలోని మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా విముక్తి దినోత్సవాలు జరుపుతుంటే, నిజాం కేంద్రమైన హైదరాబాద్‌లో మాత్రం కాంగ్రెస్, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు కేవలం ఎంఐఎం ఓటు బ్యాంక్ రాజకీయాలకు భయపడి సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. 

మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డా. శిల్పారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ గడ్డపై పుట్టిన ప్రతి ఆడబిడ్డ ధైర్యానికీ, ఆత్మగౌరవానికీ మారుపేరని కొనియాడారు. నాడు రజాకార్ల దురాగతాలను రోకలిబండలు, కారపు ముద్దలతో ఎదిరించిన వీరనారీమణుల పోరాట పటిమే నేటి మహిళా సమాజానికి ఆదర్శమని స్పష్టం చేశారు. సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే విమోచన వేడుకల్లో మహిళలు వేలాదిగా పాల్గొని విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు