శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 11.5శాతం తగ్గిన ప్రయాణికులు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో 11.5శాతం తగ్గిన ప్రయాణికులు
అమెరికా-ఇరాన్‌ యుద్ధం, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, పలు దేశాలపై ట్రంప్‌ ఆంక్షలు, పెరిగిపోతున్న ఇంధన ధరలు తదితర అంతర్జాతీయ పరిణామాలు విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే దేశంలోని ప్రముఖ ఎయిర్‌పోర్టుల్లో ఇటీవలి కాలంలో సందడి తగ్గుతోంది. వాటిలో హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉంది. ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణీకుల రాకపోకలకు సంబంధించిన గణాంకాలను తాజాగా జీఎంఆర్‌ సంస్థ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. 

దీని ప్రకారం ఢిల్లీ మినహా మిగతా అన్ని చోట్ల ఆగస్టులో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. హైదరాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో 11.5శాతం మంది ప్రయాణికుల తగ్గుదల కనిపించింది. గత ఏడాది ఆగస్టులో ఈ ఎయిర్‌పోర్టు నుంచి 24,70,499 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించగా, ఈ ఏడాది ఆగస్టులో అది 21,86,082 మందికి తగ్గింది. 

దేశీయ ప్రయాణికుల్లో 13.6 శాతం, విదేశీ ప్రయాణికుల్లో 2.6శాతం తగ్గుదల నమోదైంది. జూలైతో పోల్చితే ఆగస్టులో తగ్గుదల ఎక్కువగా ఉంది. గత ఏడాది జూలైతో పోలిస్తే ఈ జూలైలో 9.6శాతం మంది ప్రయాణీకులు తగ్గారు. ఆగస్టులో ఇది పెరిగి 11.5 శాతానికి చేరుకుంది. సాధారణంగా ప్రయాణికుల సంఖ్య ఏటా పెరుగుతూ ఉంటుంది. కానీ, అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావంతో ప్రస్తుతం దానికి భిన్నంగా ఉంది. 

ప్రయాణికుల సంఖ్యలో క్షీణత కారణంగా విమాన సర్వీసులు కూడా తగ్గుతున్నాయి. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఆగస్టులో 14,583 విమాన సర్వీసులు రాకపోకలు సాగించాయి. ఇది గత ఆగస్టుతో పోలిస్తే 14.2 శాతం తక్కువ. జీఎంఆర్‌ సంస్థ నిర్వహించే గోవాలోని మోపా విమానాశ్రయంలో కూడా ట్రాఫిక్‌ తగ్గింది. దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో గోవా ఒకటి. అక్కడ కూడా ప్రయాణికులు గణనీయంగా తగ్గిపోవడం గమనార్హం. 

గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో గోవా ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల సంఖ్య ఏకంగా 22.8 శాతం తగ్గింది. మహారాష్ట్రలోని నాగపూర్‌ విమానాశ్రయంలో 5.9 శాతం తగ్గుదల నమోదైనట్లు జీఎంఆర్‌ సంస్థ వెల్లడించింది. ఏటా అమెరికాకు ఉన్నత విద్య కోసం భారీసంఖ్యలో వెళ్లే విద్యార్థుల సంఖ్య ఆంక్షల కారణంగా గణనీయంగా తగ్గింది.

ఆగస్టులో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 60,83,616 మంది రాకపోకలు సాగించారు. ఇది గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే 2.7 శాతం అధికం. అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య 1.7 శాతం పెరగగా, దేశీయ ప్రయాణికులు 3 శాతం పెరిగారు. అలాగే ఇక్కడ విమాన సర్వీసులు కూడా గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే 11.6 శాతం పెరిగాయి. ఢిల్లీలో సరుకు రవాణా కూడా రికార్డు స్థాయికి చేరుకుంది. ఆగస్టులో 1.1 లక్షల మెట్రిక్‌ టన్నులు నమోదైంది. ఇది గతేడాదితో పోలిస్తే 11.5 శాతం అధికం.