మెట్రో రైలు తొలిదశ స్వాధీన ప్రక్రియకు అడ్డంకిగా రుణ సేకరణ

మెట్రో రైలు తొలిదశ స్వాధీన ప్రక్రియకు అడ్డంకిగా రుణ సేకరణ
హైదరాబాద్‌ మెట్రో రైలు తొలిదశ స్వాధీన ప్రక్రియకురుణ సేకరణ అడ్డంకిగా మారింది. సెప్టెంబరు 30లోగా ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ అవసరమైన రూ.13,600 కోట్ల రుణం ఇంకా కొలిక్కి రాకపోవడంతో గడువు పొడిగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఎల్‌అండ్‌టీ వాటా కొనుగోలుకు కుదిరిన షేర్‌ పర్చేస్‌ అగ్రిమెంట్‌అమలుకు మరో మూడు నెలలు పట్టే అవకాశం ఉంది. 
 
అయితే నాలుగు శాతం కంటే తక్కువ వడ్డీకి రుణం అందించే సంస్థ ముందుకొస్తే అక్టోబరులోనే ప్రక్రియను పూర్తి చేయగలమని మెట్రో అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  మెట్రోరైలు తొలిదశ స్వాధీనానికి అవసరమైన రుణ సమీకరణ బాధ్యతను ప్రభుత్వం ఎస్‌బీఐ క్యాప్స్‌కు అప్పగించింది. రెండు నెలల్లోగా రుణ ప్రక్రియను పూర్తి చేయాలని ఆ సంస్థకు సూచించింది. 
 
ఇప్పటికే నెలకుపైగా గడిచినా తుది నిర్ణయం వెలువడలేదు. నాలుగు శాతం కంటే తక్కువ వడ్డీకి రుణాలు సమకూర్చే సంస్థల కోసం ఎస్‌బీఐ క్యాప్స్‌ అన్వేషణ కొనసాగిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో సెప్టెంబర్ చివరి నాటికి రుణ సేకరణ పూర్తవడం కష్టమని అధికారులు భావిస్తున్నారు. రుణదాత కోసం ఎస్‌బీఐ క్యాప్స్‌ ప్రయత్నాలు కొనసాగిస్తుండగా మెట్రో అధికారులు ఇండియన్‌ రైల్వే ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(ఐఆర్‌ఎఫ్‌సీ)తోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. 
 
తొలుత మెట్రో స్వాధీనానికి అవసరమైన రూ.13,527 కోట్ల రుణాన్ని అందించేందుకు ఐఆర్‌ఎఫ్‌సీ ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించిన ఒప్పందాలు కూడా పూర్తయ్యాయి. అయితే ఆర్థికపరమైన కారణాలతో ఆ ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోయింది. ఇప్పుడు మరోసారి ఐఆర్‌ఎఫ్‌సీతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌ మెట్రోరైలు మొదటిదశలో ఎల్‌అండ్‌టీ వాటాను ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు ఈ ఏడాది ఏప్రిల్‌ 29న ఎస్‌పీఏ కుదిరింది. 
 
రూ.1,461.47 కోట్లతో ఈక్విటీ కొనుగోలుకు ఒప్పందం జరిగింది. అయితే రుణ సమీకరణలో జాప్యం కారణంగా స్వాధీన ప్రక్రియ ముందుకు సాగడం లేదు. మరో వైపు ఎల్‌అండ్‌టీతో ఒప్పందం కుదిరిన తేదీ నుంచి రుణాలపై వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. రోజుకు సుమారు రూ.2.5 కోట్ల మేర వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. తక్కువ వడ్డీకి రుణం లభిస్తే ఈ భారాన్ని గణనీయంగా తగ్గించడంతోపాటు మెట్రోరైలు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచవచ్చని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.