హైదరాబాద్ ఖైరతాబాద్‌లో మహాగణపతి కొలువుదీరాడు. 69 అడుగుల పంచముఖ సంకటహర మహాగణపతికి రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు తొలి పూజ నిర్వహించారు. వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాగణపతికి అర్చకులు ప్రత్యేక పూజలు చేయించారు. గవర్నర్ దంపతులకు మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, ఉత్సవ కమిటీ సభ్యులు స్వాగతం పలికి స్వామివారి వద్దకు తీసుకెళ్లారు.
గవర్నర్ దంపతులు పూజలు నిర్వహించిన అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ ఖైరతాబాద్ గణనాథుడికి పట్టువస్త్రాలు సమర్పించారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో స్వామివారికి భారీ కండువా, యజ్ఞోపవీతాన్ని సమర్పించారు. అనంతరం మాట్లాడిన గవర్నర్, బడా గణేశుడిని పూజించడం ఎంతో ఆనందంగా, అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఖైరతాబాద్ వాసుల ఆరోగ్యం, సుఖసంతోషాలు, సమృద్ధిని గణేశుడు కాపాడాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రతి ప్రాంతంలో, ప్రతి కుటుంబంలో గణేశ్ విగ్రహాలను ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహిస్తున్నారని గవర్నర్ పేర్కొన్నారు. ఖైరతాబాద్ గణేశుడు భక్తులందరినీ ఆశీర్వదించాలని ఆకాంక్షించారు. ప్రజలకు సేవ చేసే శక్తిని తనకు అందించాలని కోరుకున్నానని చెప్పారు. గణేశ్ ఉత్సవాలు మహారాష్ట్రలో ప్రారంభమైనప్పటికీ, ఖైరతాబాద్ గణేశుడి ప్రతిమకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందన్న గవర్నర్, 72 ఏళ్లుగా ఖైరతాబాద్‌లో గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉత్సవాలు నిర్వహించడం విశేషమని కొనియాడారు.
తొలి పూజ అనంతరం బడా గణేశ్ దర్శనానికి భక్తులను అనుమతించారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ భక్తులు పెద్ద సంఖ్యలో ఖైరతాబాద్‌కు తరలివచ్చారు. దీంతో పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ 72వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ ఏడాది 69 అడుగుల ఎత్తు, 28 అడుగుల వెడల్పుతో మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఐదు పడగల ఆదిశేషుడి నీడలో ఐదు ముఖాలు, ఎనిమిది హస్తాలతో పద్మంపై ఆశీనుడైన గణపతి రూపాన్ని తీర్చిదిద్దారు.
స్వామివారి కుడివైపు అంకుశం, త్రిశూలం, కమలం, అభయహస్తం ఉండగా.. ఎడమవైపు పాశం, పరశు, మాల, మోదకం ఉన్నాయి. గణపతి కుడివైపున సుమారు 20 అడుగుల ఎత్తులో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన సోమనాథ్ జ్యోతిర్లింగం, ఎడమవైపు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన కాళికామాత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి ఈసారి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. బారికేడ్లు, ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు.
సుమారు 700 మంది పోలీసు సిబ్బంది శాంతిభద్రతల విధుల్లో పాల్గొంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. మహాగణపతి దర్శనానికి భక్తులు లక్షలాదిగా తరలివచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ నియంత్రణపైనా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
More Stories
అసెంబ్లీలో నడిచింది సభ కాదు…కాంగ్రెస్–బీఆర్ఎస్ పార్టీల నాటకం
ఆపరేషన్ పోలో అమరవీరులైన వీర జవాన్లకు ఘన నివాళులు
ఆదిలాబాద్ విమానాశ్రయం ఏర్పాటుకు వేగంగా అడుగులు