విద్యుత్ వినియోగదారులపై రూ.5,420 కోట్ల ట్రూఅప్‌ చార్జీలు

తెలంగాణలో విద్యుత్తు వివినియోగదారులపై వచ్చేనెల నుంచి రూ.5,420.23 కోట్ల అదనపు భారం పడనుంది. ట్రూఅప్‌ చార్జీల రూపంలో ఈ మొత్తాన్ని వసూలు చేసేందుకు తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతినిచ్చింది. తొలి నెల యూనిట్‌కు 30 పైసలు, ఆ తర్వాత 50 పైసలు విధించనుంది. ఈ మేరకు టీజీఈఆర్సీ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 

2022-23 విద్యు త్తు కొనుగోలు వ్యయాలు, 2023-24 ఆదాయ లోటు (రెవెన్యూ ట్రూ అప్‌) కింద మొత్తం రూ.7,635.22 కోట్ల బకాయిలను వసూలు చేయడానికి ఈఆర్సీ అనుమతినిస్తూ సోమవారం ఆర్డర్‌ పాస్‌ చేసింది.  అయితే,వ్యవసాయ వినియోగదారులకు ట్రూ-అప్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది. రైతుల వాటా రూ.2,214.99 కోట్లను ప్రభుత్వమే చెల్లించనున్నట్లు తెలిపింది. ఇతర వినియోగదారుల నుంచి రూ.5,420.23 కోట్ల వసూలు చేయనుంది. 

టీజీఎస్‌పీడీసీఎల్‌ పరిధిలో రూ.4,222.93 కోట్లు, టీజీఎన్‌పీడీసీఎల్‌ పరిధిలో రూ.1,197.30 కోట్లు వసూలు చేయనుంది. ట్రూ-అప్‌ ఛార్జీని బిల్లులో ప్రత్యేకంగా చూపించాలని ఆదేశించింది. వసూలు విధానం, రేటు, వ్యవధిని బిల్లులో స్పష్టంగా పేర్కొనాలని చెప్పింది. టీజీఎస్‌పీడీసీఎల్‌లో 29 నెలలు, టీజీఎన్‌పీడీసీఎల్‌లో 26 నెలల్లో నగదు వసూలు చేయనుంది.  
 
మొదట 2022-23, 2023-24 సంవత్సరాల్లో వినియోగదారులు వాడిన వార్షిక విద్యుత్తు ఆధారంగా సగటు నెలవారీ వినియోగాన్ని లెకిస్తారు. సగటు వినియోగానికి అదనపు రేటును గుణించి నెలవారీ బిల్లులో ప్రత్యేకంగా చూపుతారు. వినియోగదారుల గత వినియోగం ఆధారంగా ట్రూ-అప్‌ లెక్కించనుంది. తెలుగు, ఇంగ్లీష్‌, ఉర్దూలో ముందస్తు ప్రచారం ఇవ్వాలని డిస్కంలకు తెలంగాణ సర్కార్ ఆదేశించింది.

About The Author