ఐదు రోజులుగా శాసనసభ సమావేశాలు సాగుతున్న తీరును రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని, ప్రజా సమస్యలను నిలదీస్తున్న బీజేపీ గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో బీజేపీ బాధ్యతాయుతంగా అవినీతి, భూ అక్రమాలపై గళమెత్తుతుంటే మంత్రులు మైకులు కట్ చేయిస్తూ అసెంబ్లీని తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు.
మొదటి మూడు రోజుల పాటు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై ఒకరినొకరు దూషించుకుంటూ ఉద్దేశపూర్వకంగా సభ సమయాన్ని వృథా చేశాయని, చివరి రోజున 22ఏ నిషేధిత జాబితాపై చర్చ పేరుతో సంబంధిత మంత్రి ఏకంగా నాలుగు గంటల పాటు మతిభ్రమించినట్లు మాట్లాడారే తప్ప 50 లక్షల మంది రైతులు, పేద వర్గాలకు సంబంధించిన సమస్య పరిష్కారానికి ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. 22ఏ సెక్షన్లను కోర్టు నిర్ణయించిందని మంత్రి చెప్పడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని మండిపడ్డారు. చట్టాలు చేసేది చట్టసభలు, జీవోలు ఇచ్చేది ప్రభుత్వమే తప్ప కోర్టులు కావని స్పష్టం చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలపై నిర్వహించిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో భయంకరమైన నిజాలు బయటపడ్డాయని, 13 వేల లావాదేవీల ద్వారా దాదాపు 23 లక్షల ఎకరాల ఆస్తులు అన్యాక్రాంతమయ్యాయని మంత్రులే సభలో అంగీకరించిన వీడియో రికార్డులను ఆయన మీడియా ముందు ప్రదర్శించారు. ఇంత భారీ కుంభకోణం జరిగిందని తెలిసినా ఆ రిజిస్ట్రేషన్లను రద్దు చేసి, భూములను ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదని నిలదీశారు.
రిజిస్ట్రేషన్ అనేది టైటిల్ డీడ్ కాదని, తప్పుడు రిజిస్ట్రేషన్లను రద్దు చేసే పూర్తి అధికారం ప్రభుత్వానికి ఉన్నా ఎందుకు తాత్సారం చేస్తున్నారో సమాధానం చెప్పాలని ఆయన స్పష్టం చేశారు. దోపిడీ జరిగిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టి నెలలు గడుస్తున్నా ఆడిట్ నివేదికను ప్రజల ముందు ఎందుకు ఉంచడం లేదని, గతంలో వేసిన సిట్ కాకుండా కొత్తగా వేసిన సెట్ కేవలం సెట్టింగ్‌లు చేసుకునేందుకేనా అని ప్రశ్నించారు. ఈ మొత్తం భూ బాగోతంపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రస్తుతం ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అనే పేరుతో హైదరాబాద్ పరిసరాల్లోని వేలాది ఎకరాల అసైన్డ్ భూములను కారుచౌకగా కాజేసేందుకు కొత్త దందా మొదలుపెట్టారని ఏలేటి ఆరోపించారు. పేద అసైనీల నుంచి ముందే బాండ్ పేపర్లు, నోటరీలు రాయించుకొని, తర్వాత వారికే ఫ్రీహోల్డ్ కల్పిస్తున్నట్లు చట్టాలు తెచ్చి లక్షల కోట్ల విలువైన ఆస్తులను తమ పేర్ల మీద మార్చుకునే పథకం రచిస్తున్నారని విమర్శించారు.
కుత్బుల్లాపూర్ పరిధిలోని ఐడీపీఎల్ కు చెందిన 333 ఎకరాల విలువైన భూమి ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లిన విషయాన్ని ప్రస్తావిస్తూ, దాదాపు రూ.33 వేల కోట్ల విలువైన ఈ భూములను ప్రభుత్వం ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదని, ప్రభుత్వ పెద్దలకు ఇందులో 30 శాతం వాటాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. అక్రమాలు జరిగినట్లు తేలినా బాధ్యులైన అధికారులపై పీడీ యాక్ట్ పెట్టడం గానీ, సస్పెండ్ చేయడం గానీ ఎందుకు చేయలేదని నిలదీశారు.
హైడ్రా పేరిట ప్రభుత్వం పేదలకో న్యాయం, పెద్దలకో న్యాయం అమలు చేస్తోందని ఆయన మండిపడ్డారు. మూసీ నదికి 100 మీటర్ల దూరంలో ఉన్న పేద, బడుగు, బలహీన వర్గాల చిన్న ఇళ్లను రాత్రికి రాత్రే బుల్డోజర్లతో కూల్చివేస్తున్న ప్రభుత్వం, మూసీ నది మధ్యలోనే మూడు ఎకరాల స్థలాన్ని ఆక్రమించిన పెద్దల జోలికి ఎందుకు వెళ్లడం లేదని, హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇచ్చిన నోటీసులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీకే చెందిన ప్రజాప్రతినిధుల భూవ్యవహారాలు, అక్రమ నిర్మాణాలపై అధికారులు మౌనం వహించడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. మరోవైపు సంబంధిత మంత్రికి ఉన్న వ్యాపార ప్రయోజనాలు, అక్రమ మైనింగ్ వ్యవహారాలపై నోటీసులు రావడం, ప్రభుత్వంలో ఉంటూనే రూ.1,400 కోట్ల కాంట్రాక్టులను రివైజ్డ్ ఎస్టిమేషన్ల పేరుతో రూ.4,000 కోట్లకు పెంచుకోవడం ముమ్మాటికీ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, క్విడ్-ప్రో-కో కాదా? అని సూటిగా ప్రశ్నించారు.
అధికారంలో ఉన్నామని విర్రవీగితే చూస్తూ ఊరుకోబోమని, తమ వద్ద 200లకు పైగా పక్కా ఆధారాలతో కూడిన కేసు స్టడీలు ఉన్నాయని ఏలేటి మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఆడుతున్న ఈ దోపిడీ నాటకాన్ని ప్రజల ముందు బట్టబయలు చేస్తామని స్పష్టం చేశారు.
ఈ అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలను, గౌరవ గవర్నర్‌ను కలుస్తామని, అవసరమైతే రాజ్యాంగ పుస్తకం చేతబట్టి తిరిగే రాహుల్ గాంధీ నివాసం ముందే ఢిల్లీలో ధర్నా చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వ ద్వంద్వ నీతిని దేశవ్యాప్తంగా ఎండగడతామని ఆయన స్పష్టం చేశారు.
More Stories
నాలుగు దేశాలుగా విడిపోనున్న యుకె?
మరో 25 ఏళ్లల్లో అమెరికాను అధిగమించనున్న భారత్
ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో 2029లోపు ఉమ్మడి పౌరస్మృతి