రవి అస్తమించని సామ్రాజ్యంగా వెలుగొంది 19వ శతాబ్దం నాటికి ప్రపంచంలో ఎక్కువ భూభాగాన్ని తన అధీనంలో ఉంచుకున్న యునైటెడ్ కింగ్‌డమ్ ఇప్పుడు నాలుగు ముక్కలయ్యే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి విడిపోవడానికి స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ మూడు దేశాల ఫస్ట్ మినిస్టర్లు సోమవారం కార్డిఫ్‌లో సమావేశం కానున్నారు.
ఈ ముగ్గురు స్వయం నిర్ణయాధికారంపై ఒక సంయుక్త ప్రకటనపై సంతకాలు చేయనున్నారు. ఉత్తర ఐర్లాండ్‌లోని అతిపెద్ద పార్టీ అయిన సిన్ ఫేన్ పార్టీ అధ్యక్షురాలు మేరి లూ మెక్‌డొనాల్డ్ సైతం ఈ సమావేశంలో పాల్గొననున్నారు. తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునే హక్కు కోసం వీరు గళం ఎత్తుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్ ప్రాధాన్యం తగ్గిపోవడం మొదలైంది. ప్రస్తుతం జీడీపీ పరంగా చూస్తే బ్రిటన్ ప్రపంచంలో ఐదో స్థానంలో ఉంది.
నాలుగు దేశాలుగా విడిపోతే ఇంగ్లాండ్ ఐదు నుంచి ఏడో స్థానానికి పడిపోతుంది. యూకేకి ఉన్న వైశాల్యంలో ఇంగ్లాండ్ 46 శాతాన్ని కోల్పోవాల్సి వస్తుంది. నార్త్ సముద్రంలోని మెజార్టీ చమురు, సహజ వాయువు నిల్వలు, పవన్ విద్యుత్ కేంద్రాలు స్కాట్లాండ్ సరిహద్దులకే పరిమితం అవుతాయి. ఐక్యరాజ్య సమితిలోని యూకే వీటో అధికారం ఎవరికి దక్కాలనే చర్చ కూడా జరుగుతుంది.
ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా స్వాతంత్య్రాన్ని సాధించే హక్కుతోపాటు తమ దేశాల స్వయ నిర్ణయాధికారం గురించి నొక్కి చెబుతూ స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్ జాన్ స్విన్నీ, వేల్స్ ఫస్ట్ మినిస్టర్ రూన్ అప్ ఇయోర్‌వర్త్, ఉత్తర ఐర్లాండ్ నాయకత్వం కలిసి ఒక సంయుక్త ప్రకటనపై సంతకం చేయనున్నారు.
స్వాతంత్య్రానికి సంబంధించిన ఓ కొత్త రాజకీయ ప్రచారం గురించి చర్చించడంతోపాటు ఆర్థిక వ్యవస్థ, ఎనర్జీ, యూరోప్, అంతర్జాతీయ వ్యవహారాల్లో సన్నిహిత సహకారం పెంపొందించుకోవాలని వీరు భావిస్తున్నారు.
2014లోనే బ్రిటన్ నుంచి విడిపోవడానికి స్కాట్లాండ్‌లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. కానీ మెజార్టీ స్కాటిష్ ప్రజలు బ్రిటన్‌లో కొనసాగడానికే మొగ్గు చూపారు. అయితే 2016లో యూరోపియన్ యూనియన్ నుంచి యూకే బయటకొచ్చింది. ఆ సందర్భంగా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో మెజార్టీ స్కాట్లాండ్ ప్రజలు ఈయూ కొనసాగాలని ఓటేశారు.
కానీ ఇంగ్లాండ్ ప్రజలు బయటకు రావాలని కోరుకోవడంతో ఈయూ నుంచి యూకే బయటకొచ్చింది. దీంతో తమ ప్రమేయం లేకుండానే ఈయూ నుంచి బయటకొచ్చామనే అసంతృప్తి స్కాట్లాండ్ ప్రజల్లో ఉంది. స్కాటిష్ స్వాతంత్య్రం కోసం మరోసారి ప్రజాభిప్రాయ సేకరణకు స్పష్టమైన ఏకాభిప్రాయం లేదని, ఒకవేళ ఉంటే దాన్ని పరిశీలించొచ్చని యూకే ప్రధాని ఆండీ బర్న్‌హమ్ సూచించారు. ఈ నేపథ్యంలో స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ ఫస్ట్ మినిస్టర్ల సదస్సు జరుగుతుండటం గమనార్హం.
యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రి ఆండీ బర్న్‌హామ్ కూడా, స్కాట్లాండ్ ప్రజాభిప్రాయ సేకరణకు అనుకూలంగా “స్పష్టమైన ఏకాభిప్రాయం” ఉంటే, దానికి తాను అధికారం ఇస్తానని ఆ దేశంలోని పార్లమెంట్ సభ్యులకు సూచించారు. మే నెలలో వేల్స్‌లో జరిగిన ఎన్నికలలో లేబర్ పార్టీ ఓటమి తర్వాత, యూకే స్వయంప్రతిపత్తి గల మూడు దేశాలైన స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌లలో మొదటిసారిగా స్వాతంత్ర్య అనుకూల పార్టీలు అధికారంలోకి వచ్చాయి. వేల్స్‌లో, మే నెలలో కార్డిఫ్ సెనెడ్‌లో ప్లాయిడ్ సిమ్రు అతిపెద్ద పార్టీగా అవతరించగా, రున్ అప్ ఇయోవర్త్ మొదటి మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
శనివారం డబ్లిన్‌లో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ యునైటెడ్ ఐర్లాండ్ ఏర్పాటు కావడాన్ని తాను ఇష్టపడతానని, ఐర్లాండ్ పునరేకీకరణ అద్భుతమైన విషయం కాగలదని చెప్పారు. ఐర్లాండ్ దీవిలో దక్షిణ భాగంలో ఉండే ప్రాంతం పూర్తి స్వతంత్ర దేశం కాగా, ఉత్తర భాగంలో ఉండే ఆరు కౌంటీలు యూకేలో భాగంగా ఉన్నాయి.
1921లో బ్రిటన్ పాలన నుంచి విడిపోతున్నప్పుడు ప్రొటెస్టెంట్లు ఎక్కువగా ఉన్న ఉత్తర ఐర్లాండ్ బ్రిటన్‌లోనే ఉండాలని నిర్ణయించుకుంది. 1989లో జరిగిన గుడ్ ఫ్రైడే ఒప్పందం ప్రకారం ఉత్తర ఐర్లాండ్, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్ రెండింటిలోనూ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి మెజార్టీ ప్రజల మద్దతు లభిస్తేనే ఐర్లాండ్ పునరేకీకరణ సాధ్యపడుతుంది.
వేల్స్, ఉత్తర ఐర్లాండ్, స్కాట్లాండ్‌లలో స్వాతంత్య్రాన్ని కోరుకునే పార్టీలు బలాన్ని పెంచుకున్నాయి. ఇది యూకేపై ఒత్తిడిని పెంచుతోంది. యూకే చరిత్రలో తొలిసారిగా స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌లు స్వాతంత్య్రాన్ని సమర్థించే ఫస్ట్ మినిస్టర్ల నాయకత్వంలో ఉన్నాయని స్కాట్లాండ్ ఫస్ట్ మినిస్టర్ స్విన్ని అభిప్రాయపడ్డారు. యూకే విడిపోవడం మినహా మరే అవకాశం లేదని స్విన్ని పరోక్షంగా వ్యవహరించారు.
గ్రేట్ బ్రిటన్ అనేది ప్రధానంగా ఒక భౌగోళిక ద్వీపం. ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్ ఇందులో భాగంగా ఉన్నాయి. ఈ మూడు దేశాలకు ఉత్తర ఐర్లాండ్ కూడా కలిస్తే దాన్ని యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) అంటారు. ఐక్యరాజ్య సమితిలో యునైటెడ్ కింగ్‌డమ్‌కు మాత్రమే సభ్యత్వం ఉంటుంది. 1999లో బ్రిటన్ ప్రభుత్వం స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌లకు స్వయంప్రతిపత్తి కల్పించింది.
ఆరోగ్యం, విద్య, రవాణా, పోలీసు, పర్యావరణం లాంటి వ్యవహారాలను స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ వేటికవే చూసుకుంటాయి. రక్షణ, విదేశాంగ విధానం, జాతీయ భద్రత, ఇమిగ్రేషన్, కరెన్సీ, పన్నులు లాంటి వ్యవహారాలు యూకే పార్లమెంట్ వెస్ట్‌మినిస్టర్ పరిధిలో ఉంటాయి. ఈ నాలుగు ప్రాంతాల ప్రజలకు బ్రిటిష్ పాస్‌పోర్ట్ ఉంటుంది. ఫుట్‌బాల్, రగ్బీ లాంటి క్రీడల్లో నాలుగు జట్లు వేర్వేరుగా పాల్గొంటాయి. కానీ ఒలింపిక్స్ లాంటి అంతర్జాతీయ క్రీడల్లో మాత్రం బ్రిటన్ పేరిట నాలుగు కలిసి బరిలోకి దిగుతాయి.
More Stories
అసెంబ్లీలో నడిచింది సభ కాదు…కాంగ్రెస్–బీఆర్ఎస్ పార్టీల నాటకం
మరో 25 ఏళ్లల్లో అమెరికాను అధిగమించనున్న భారత్
ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో 2029లోపు ఉమ్మడి పౌరస్మృతి