ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ బలంతోనే బిజెపి ప్రచారం

 
తెలంగాణాలో జరుగనున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  ప్రత్యర్థి పార్టీలు కేవలం అభ్యర్థుల కేంద్రంగా ప్రచారాలు చేసుకుంటుంటే, బీజేపీ మాత్రం పటిష్టమైన కార్యకర్తల బలం, క్యాడర్ బేస్ ఆధారంగా ముందుకు సాగాలని నిర్ణయించింది.   పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర విస్తృత స్థాయి పదాధికారుల సమావేశంలో  ప్రస్తుతం ముగింపు దశకు చేరుకున్న ఎస్ఐఆర్ ప్రక్రియతో పాటు, రాష్ట్రంలో ప్రారంభమైన ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియపై సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  డా. ఎన్. గౌతంరావు తెలిపారు.
 
బూత్ స్థాయి నుంచే ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేశామని, ఈ విషయంలో బీజేపీ ఎక్కడా వెనుకబడలేదని స్పష్టం చేశారు.
ఎన్నికల నిర్వహణ కమిటీ, అభిప్రాయ సేకరణ కమిటీల సూచనలు, అంతర్గత చర్చల ఆధారంగా అభ్యర్థుల పేర్లను ఖరారు చేసి, తుది ఆమోదం కోసం త్వరలోనే కేంద్ర నాయకత్వానికి పంపనున్నట్లు వెల్లడించారు.

అలాగే, దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు సేవా సంకల్ప్ అభియాన్ పేరిట నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘సేవా జ్యోతి’ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని పార్టీ నిర్ణయించిందని పేర్కొన్నారు.  ప్రతి శక్తి కేంద్ర పరిధిలోని మూడు నాలుగు బూత్‌ల నుంచి ఐదు వాహనాలతో మొదలై మండల కేంద్రానికి, అక్కడి నుంచి అసెంబ్లీ, ఆపై జిల్లా కేంద్రాలకు చేరుకునేలా భారీ ర్యాలీలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తున్నామని వివరించారు. 
 
హైదరాబాద్‌‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఏ ఒక్కచోటా రెండు మూడు వేల మందికి తగ్గకుండా భారీ సమావేశాలు ఉంటాయని, ఈ సందర్భంగా ఆ రోజు ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ  వర్చువల్ విధానం ద్వారా దేశవ్యాప్తంగా జరిగే ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. రాబోయే రోజుల్లో ఎదురయ్యే ఎమ్మెల్సీ ఎన్నికలు, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలను అత్యంత పకడ్బందీగా ఎదుర్కొనేందుకు బూత్ స్థాయి నుంచే పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నామని డా. గౌతంరావు తెలిపారు.
అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.  ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రమవుతున్న తాగునీటి ఎద్దడిపై రాబోయే రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి, ప్రజల పక్షాన పోరాడుతామని ఆయన హెచ్చరించారు. 

About The Author