అక్టోబర్ 7న సేవా జ్యోతి యాత్ర, వికసిత్ భారత్ సంకల్ప సభ

 
* రాష్ట్రంలో దేవాలయాలపై దాడుల వెనుక కుట్ర
 
సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా ఈ నెల 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో ‘సేవా జ్యోతి యాత్ర’, ‘వికసిత్ భారత్ సంకల్ప సభ’ నిర్వహిస్తున్నట్లు  బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రాంచందర్ రావు వెల్లడించారు.  రాష్ట్ర పదాధికారుల సమావేశం మాట్లాడుతూ ఆయా జిల్లాల్లోని అన్ని మండలాల నుంచి కార్యకర్తలు, నాయకులు ఉదయం 9:00 గంటలకే పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. 
 
ఉదయం 10 గంటల తర్వాత  ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ , బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వర్చువల్ విధానంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడతారని, దేశాన్ని ‘వికసిత్ భారత్’గా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు తరలివచ్చి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని రాంచందర్ రావు పిలుపునిచ్చారు.
 
కాగా, సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి ఘటన మొదలుకొని ఇటీవల మల్కాజిగిరి, దిల్‌సుఖ్‌నగర్ సంతోషిమాత ఆలయాల వరకు వరుసగా హిందూ దేవాలయాలపై దాడులు జరగడం వెనుక స్పష్టమైన కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపించారు. దాడి జరిగిన ప్రతిసారీ పోలీసులు రంగప్రవేశం చేసి నిందితుడికి ‘మతిస్థిమితం లేదు’ అంటూ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేయడం రివాజుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
మతిస్థిమితం లేని వారికి కేవలం హిందూ దేవాలయాలే కనిపిస్తున్నాయా? అని సూటిగా ప్రశ్నించారు. మజ్లిస్ పార్టీతో చేతులు కలిపిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఇలాంటి దుశ్చర్యలను ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొంటూ హిందూ దేవతలను స్వేచ్ఛగా ఆరాధించుకోవాలన్నా, ప్రజల ఆత్మగౌరవం నిలబడాలన్నా బిజెపి అధికారంలోకి రావడం ఒక్కటే మార్గమని పిలుపునిచ్చారు.
 
కాగా, ప్రస్తుతం జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో కోట్లాది మంది అక్రమ చొరబాటుదారుల పేర్లు వెలుగుచూస్తున్నాయని ఆయన తెలిపారు. హైదరాబాద్‌‌లోని మహేశ్వరం నియోజకవర్గంలోనే సుమారు 30 వేల మంది రోహింగ్యాలు, అక్రమ ఓటర్లు ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు. చొరబాటుదారుల పేర్లను జాబితా నుంచి తొలగిస్తుంటే ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్, ‘ఇండి’ కూటమి నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
 
తెలంగాణలో అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన 6 గ్యారెంటీలు సహా హామీలేవీ అమలు చేయలేదని  రామచందర్ రావు ఎద్దేవా చేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఇవ్వడం లేదని, రైతు భరోసా లేదని, రిటైర్డ్ ఉద్యోగులకు సకాలంలో పెన్షన్లు అందడం లేదని, ఉపాధ్యాయ నియామకాలు, ఉద్యోగుల ప్రమోషన్లు పూర్తిగా అటకెక్కాయని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను సైతం రాష్ట్రంలో అమలు చేయకుండా రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం బాగుపడితే, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో రేవంత్ రెడ్డి అండ్ బ్రదర్స్ దోచుకుంటూ బాగుపడ్డారు తప్ప సామాన్య ప్రజల కష్టాలు, సమస్యలు తీరలేదని స్పష్టం చేశారు.  వీరికి ప్రత్యామ్నాయంగా తెలంగాణను రక్షించే సత్తా ఒక్క బిజెపికే ఉందని ప్రజలు బలంగా నమ్ముతున్నారని గుర్తుచేశారు. 

About The Author