`సామూహిక ఓటు హక్కు రద్దు’ “రెండో తరగతి పౌరులుగా” మారుస్తుంది

“ఎంత వాదించినా దానిని సమర్థించలేము,” అని లక్షలాది మంది భారత పౌరులకు వారి ఓటు హక్కును నిరాకరించే ఏ చర్యకైనా వ్యతిరేకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఆదివారం హెచ్చరించారు. అటువంటి సామూహిక ఓటు హక్కు రద్దు “సహజంగానే ఏకపక్షమైనది” అవుతుందని, అది అర్హులైన ఓటర్లను “వారి సొంత దేశంలోనే రెండవ తరగతి పౌరులుగా” మార్చగలదని ఆయన స్పష్టం చేశారు. 
 
నల్సార్  లా యూనివర్సిటీలో జరిగిన 19వ నల్సార్-జస్టిస్ బి.ఆర్. సాహ్నే మెమోరియల్ మూట్ కోర్ట్ పోటీల ముగింపు కార్యక్రమంలో  మాట్లాడుతూ భారీ సంఖ్యలో దేశ పౌరుల ఓటు హక్కును హరించే ఏ ప్రక్రియ అయినా ‘రాజ్యాంగ వ్యవస్థను ఉల్లంఘించడమే’ అని తేల్చి చెప్పారు. ‘‘ఏ అధికార వ్యవస్థ అలా చేయరాదు. ఏ న్యాయస్థానం కూడా దానిని సమర్ధించదు’’ అని ఆయన ఉద్ఘాటించారు.
 
‘‘భారత రాజ్యాంగం పౌరులందర్నీ సమానంగా చూస్తుంది. ఓటు హక్కు ఉన్నవారు, ఓటు హక్కులేనివారు అని వర్గీకరించదు. భారత రాజ్యాంగంలో ఓటు హక్కు ఉన్న పౌరులు, ఓటు హక్కు లేని పౌరులు అని రెండు వర్గాలు లేవు’’ అని ఆయన తెలిపారు.  ‘‘ఒక భారతీయ పౌరుడికి ఓటు హక్కు లేదా ఓటర్ల జాబితాలో పేరు పొందే హక్కును కాదనలేం. అలా అయితే అది శరీరం నుంచి ఆత్మను వేరు చేసినట్లే అవుతుంది’’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.
 
ఇలాంటి చర్యలు సమానత్వ హక్కును ప్రసాదించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, సార్వజనీన వయోజన ఓటు హక్కును కల్పించే ఆర్టికల్ 326ని ఉల్లంఘించడమేనని ఆయన తేల్చి చెప్పారు. ‘‘భారత రాజ్యాంగం కింద స్వీకరించిన రక్షణలను ఇది తిరస్కరించడమేనని నేను ఖచ్చితంగా చెబుతాను’’ అని వ్యాఖ్యానించారు. అయితే ఆయన ఏ నిర్దిష్ట ప్రక్రియను లేదా అధికార వ్యవస్థ పేరును ప్రస్తావించలేదు. 
 
ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ నిర్వహణలో ఎలక్షన్ కమిషన్‌కు ఉన్న అధికారాన్ని సుప్రీంకోర్టు ఏకగ్రీవంగా సమర్థించిన నాలుగు నెలల తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. గత కొన్ని వారాలుగా ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తి, ఉద్దేశాలపై ప్రతిపక్షాల నుంచి మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎస్ఐఆర్‌పై ఈ ఏడాది మే నెలలో తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు ఈ ప్రక్రియ ఈసీ పరిధిలోదేనని, దాని చర్యలు అతిగా లేదా అనుచితంగా లేవని స్పష్టం చేసింది. అర్హతలపై కమిషన్‌కు సంతృప్తి లేని పక్షంలో ఆ కేసులను తగిన అధికార యంత్రాంగానికి పంపొచ్చని పేర్కొంది. వీటిపై విచారణల కోసం పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో అప్పిలేట్ ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేశారు. అక్కడ తేలిన కేసుల్లో ఇప్పటివరకు 93 శాతం మందికి తిరిగి ఓటు హక్కు లభించింది.

 
జస్టిస్ భూయాన్ విస్తృత కోణంలో మాట్లాడుతూ, ఓటు హక్కును భారత్ స్వాతంత్ర్య పోరాటంతో ముడిపెట్టారు. ‘‘భారత పౌరుల ఓటు హక్కు విదేశీ పాలనకు వ్యతిరేకంగా మనం చేసిన సుదీర్ఘ పోరాటంతో ముడిపడి ఉంది. ఎన్నో పోరాటాలు, త్యాగాల తర్వాత సాధించుకున్న స్వేచ్ఛకు ఇది ప్రతీక’’ అని ఆయన తెలిపారు.  ‘‘ఆర్టికల్ 326తో ఏ రకమైన ఆటాడకూడదు. ఏ అధికార వ్యవస్థా దానిని దెబ్బతీయలేదు, ఏ కోర్టు దానిని సమర్థించదు. రాజ్యాంగం కంటే ఎవరూ ఎక్కువ కాదు’’ అని ఆయన స్పష్టం చేశారు.
చనిపోయిన ఓటర్ల విషయంలో తప్ప ‘‘ఓటర్ల జాబితాలో నమోదయి ఒక ఓటరు పేరును ముందస్తు నోటీసు, విచారణ లేకుండా తొలగించకూడదు’’ అని తెలిపారు. ‘ఓటు హక్కు లేని పౌరుడికి విలువ ఏముంటుంది?’ అని ఆయన ప్రశ్నించారు. 1979లో మద్రాస్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ప్రముఖ న్యాయకోవిదుడు నానీ పాల్కీ వాలా చేసిన ప్రసంగాన్ని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి గుర్తుచేశారు.
‘‘స్వేచ్ఛ అనేది రక్తం ద్వారా వారసత్వంగా సంక్రమించదు.. ప్రతి తరం దానిని కాపాడుకోవాలి, దాని కోసం పోరాడాలి. అప్పుడు మాత్రమే అది మనుగడ సాగించి తదుపరి తరానికి అందుతుంది’’ అని తెలిపారు.  అలాగే, ప్రజాస్వామ్యంలో అత్యున్నత పదవి అంటే అధ్యక్షుడిది కాదు, పౌరుడిదేనన్న అమెరికా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఫెలిక్స్ ఫ్రాంక్‌ఫర్టర్ వ్యాఖ్యలను జస్టిస్ భుయాన్ ఉటంకిస్తూ ‘‘ప్రజాస్వామ్యం అనేది ఎల్లప్పుడూ ఆకర్షించే ఒక గమ్యస్థానం తప్ప, సురక్షితమైన ఓడరేవు కాదు; ఎందుకంటే స్వేచ్ఛ అనేది నిరంతర ప్రయత్నం, అదెప్పుడూ ఒక ముగింపు కాదు’’ అని చెప్పారు.

భారత సుప్రీంకోర్టు ఓటు హక్కును ప్రాథమిక హక్కుగా గుర్తించకపోయినప్పటికీ, రాజ్యాంగబద్ధమైన హక్కుగా గుర్తించిందని ఆయన చెప్పారు. ‘కాబట్టి, నా దృష్టిలో, భారత పౌరుడు తన ఓటును వేసే హక్కు రాజ్యాంగ నిర్మాణానికే అత్యంత కీలకమైనది’’ అని పేర్కొన్నారు. సార్వజనీన వయోజన ఓటు హక్కును రాజ్యాంగ రూపకర్తలు సామాన్యుడిపై ఉంచిన ‘నమ్మకం’గా అభివర్ణిస్తూ, ‘‘ఒక వ్యక్తి కోటీశ్వరుడు కావచ్చు, మరొకరు రిక్షా కార్మికుడు కావచ్చు; కానీ వారిద్దరికీ ఓటు హక్కు ఉంటుంది. వారి ఓటు విలువ సమానంగానే ఉంటుంది’’ అని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తెలిపారు.

 

About The Author