ఎన్నికల సంఘం స్థానికులందరిని ఒకే తేదీన రప్పించాలి

* కమలానంద భారతి స్వామి సూచన  
 
ఎన్నికల సంఘం మొత్తం భారతదేశంలో ఒక విధానాన్ని అమలుపరచడం ద్వారా ప్రస్తుత సమస్యను అధిగమించవచ్చు అని  శ్రీ భువనేశ్వరి పీఠం అధిపతి కమలానంద భారతి స్వామి సూచించారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అప్పటి ప్రభుత్వం ఒక తేదీని నిర్ణయించి ఆ తేదీకి తెలంగాణలోని స్థానికులందరినీ ఎక్కడ ఉన్నప్పటికీ అక్కడికి రప్పించి ఒక సమగ్ర సర్వే నిర్వహించిందని ఆయన గుర్తు చేశారు. దేశ విదేశాలలో ఉన్న తెలంగాణ ప్రాంత పౌరులందరూ బాధ్యతగా తమ తమ స్వస్థలాలకు చేరుకుని ప్రభుత్వం చేపట్టిన సర్వేకి పూర్తిగా సహకరించారని చెప్పారు. 
 
అలాగే ఎన్నికల సంఘం రాష్ట్రాల వారీగా కానీ లేదా జిల్లాల వారీగా కానీ ఎన్నికలు ఏ విధంగా నిర్వహిస్తారో అదే విధంగా ఓటర్ల జాబితాను తయారు చేయడానికి కూడా తేదీలు నిర్వహించి, ఆ తేదీకి వారు తమ ఇళ్లలో ఉండే విధంగా లేదా ఏ ఏ స్థలాలలో ఉన్నప్పటికీ అక్కడి నుంచి సమాచారం లేదా సంబంధం కలిగి ఉండి తమ తమ ఓటును పొందే విధంగా ఒక విధానాన్ని స్వీకరించడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం దొరకవచ్చని ఆయన పేర్కొన్నారు.
 
ఒకే వ్యక్తికి అనేక ఓట్లు ఉండటం, ఒకే వ్యక్తికి అనేక ప్రాంతాలలో ఓట్లు ఉండటం, ఒకే కుటుంబంలో వందల ఓట్లు ఉండటం, వయసుతో సంబంధం లేకుండా కొన్ని కొన్ని సామాజిక వర్గాలకు వాళ్లకు ఉన్న మత సంబంధిత రక్షణను కవచంగా ఏర్పాటు చేసుకుని ఇష్టారాజ్యంగా ఓట్లు పొందటం వంటి వాటిని ఎన్నికల సంఘము కచ్చితంగా ఎండగట్ట వలసిందే అని స్పష్టం చేశారు.
 
చాలా సందర్భాల్లో అనేకమందికి ఓట్లు లేకపోవడం, ఇప్పుడు కాదు ఎప్పుడూ ఉందని ఆయన తెలిపారు. ఉద్యోగస్తులుగా ఉన్న వాళ్ళు లేదా సమాజంలో బాగా గుర్తు ఉన్నవాళ్లు కూడా తమకు ఓటు లేకపోవడం దానిపై ఎన్నికల కమిషన్ కు, రాష్ట్రపతికి ఉత్తరాలు రాయడం ఇవన్నీ ఎప్పుడో జరిగాయని ఆయన చెప్పారు. ఇది ఏమీ కొత్త కాదు కాబట్టి ప్రతి వ్యవస్థలో ఒకటి రెండు శాతం కొంత అటు ఇటుగా పొరపాట్లు ఉండవచ్చని తెలిపారు.
 
అంత మాత్రం చేత మొత్తం వ్యవస్థ చేతకానిదిగాను లేదా ఎవరికో మేలు చేయడం కొరకు పని చేస్తున్నదని దేశంలోని రాజ్యాంగబద్ధమైన ఒక్కొక్క వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని నిర్వీర్యం చేయడం మొత్తము దేశాన్ని బలహీనపరచటమే అవుతుందని  కమలానంద భారతి స్వామి హెచ్చరించారు. అన్ని రాజకీయ పార్టీలు ఓటర్ల జాబితాలు తయారు చేయడంలో తన రాజకీయ పార్టీల కార్యకర్తలను ఎంత తక్కువ కుటుంబాలకు బాధ్యతగా ఏర్పాటు చేసుకుని, అంత వేగంగా ఓటర్లను చైతన్యపరిచి, వాళ్ళ ఓట్లను జాబితాలో ఉండేట్టుగా చేయడం కూడా పార్టీల బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.
 
అన్ని ఎన్నికలలో అన్ని పార్టీల కార్యకర్తలు గడపగడపకు తిరిగి ఓటర్ స్లిప్పులను పంచడానికి చూస్తూ ఉంటాం అని, అన్ని పార్టీలు ఈ పని చేస్తారని ఆయన గుర్తు చేశారు. ప్రతి ఇంటిని కలుస్తారు. ఒకవేళ వార్డు నుంచి ఒక ఓటు పక్క వార్డుకు వెళితే ఆ ఓటర్ ని గుర్తించి అక్కడికి వెళ్లి అతని తీసుకొచ్చి ఓటు వేయించుకుంటారని చెప్పారు.
 
కాబట్టి రాజకీయ పార్టీలకు వ్యవస్థ లేదని కాదని, ఈ పనిని బాధ్యతగా చేయించాలన్న ఒక అలవాటు కానీ, అనుభవం కానీ అవసరం అవసరం అని స్వామిజీ సూచించారు. ఎన్నికలప్పుడు ఓటర్ల జాబితా ప్రకారం స్లిప్పులు ఎలా పంచుతున్నారో, అదేవిధంగా ప్రతి ఇంటిలో ప్రతి ఓటు నమోదు అయ్యేట్టుగా రాజకీయ పార్టీలు తమ కార్యకర్తలు చేత ఈ పని చేసి ప్రజాస్వామ్యం పట్ల రాజ్యాంగం పట్ల తమ విశ్వసనీయతను, తమ బాధ్యతను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన హితవు చెప్పారు. 

 

About The Author