బీజేపీ చేపట్టిన ‘రైతు గోస – బీజేపీ భరోసా’ కార్యక్రమంలో భాగంగా ఐదు రోజుల క్రితం చేవెళ్ల, పరిగి నియోజకవర్గాల నుండి ప్రారంభమైన తమ పర్యటనలో రాష్ట్రవ్యాప్తంగా వరి కొనుగోలు కేంద్రాలలో రైతులు పడుతున్న అగచాట్లను కళ్లారా చూశామని బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా కిలోమీటర్ల మేర రోడ్లపై ధాన్యం కుప్పలు పోసి, మండుటెండల్లో భార్యాపిల్లలతో సహా రైతులు కాపలా కాస్తున్నారని పేర్కొన్నారు.
రైతులకు ఐకేపీ కేంద్రాలు ఏఎంసీ సెంటర్లుగా కాకుండా జైళ్లలా కనిపిస్తున్నాయని, అకాల వర్షాలకు ధాన్యం తడిసి, మొలకలు వస్తుంటే ఆరబోసుకోలేక, కాపలా కాయలేక ఆరుగాలం కష్టపడిన రైతన్న కన్నీరు పెడుతున్నాడని, సాగు సమయం దగ్గర పడుతున్నా ధాన్యం అమ్ముడుపోక పొలం పనులు చేసుకోలేని దయనీయ స్థితిలో రైతాంగం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో 80 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు పచ్చి అబద్ధాలు చెప్తున్నారని ఏలేటి మండిపడ్డారు. ఇప్పటివరకు కేవలం 45 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి 80 శాతం అయిపోయిందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఉత్తర తెలంగాణ నుండి దక్షిణ తెలంగాణ వరకు రాష్ట్ర వ్యాప్తంగా దళారుల మాఫియా రాజ్యమేలుతోందని, మిల్లుల వద్ద తరుగు పేరిట సంచికి 2 నుండి 4 కిలోలు కోత విధిస్తూ, క్వింటాలుకు ఏకంగా 10 కిలోల వరకు నష్టపరుస్తున్నారని ఆరోపించారు.
ధాన్యం కొనుగోళ్లు, గన్నీ బ్యాగులు, రవాణా, హమాలీ చార్జీల కోసం కేంద్ర ప్రభుత్వం ముందస్తుగా నిధులు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సంచికి రూ.75 నుండి రూ.80 వరకు రైతులతోనే బలవంతంగా వసూలు చేయిస్తోందని మండిపడ్డారు. ఈ అదనపు తరుగు, అక్రమ వసూళ్ల ద్వారా రాష్ట్రంలో రైతుల రక్తాన్ని తాగుతూ దాదాపు రూ.4,000 కోట్ల దోపిడీ సాగుతోందని చెబుతూ ఈ సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్తోందో కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ధాన్యమే కాకుండా సోయాబీన్, మక్కలు, జొన్నలు, శనగలు, సన్ ఫ్లవర్ వంటి 10 పంటలకు మద్దతు ధర ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఎకరాకు కేవలం పాక్షికంగానే కొంటూ రైతులను దగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ. 15,000 రైతు భరోసా లేదు, ఫసల్ బీమా లేదు, పంట నష్ట పరిహారం ఊసే లేదని, మూసీ పునరుద్ధరణ పేరిట లక్షల కోట్లు మాట్లాడే ప్రభుత్వానికి, రైతులకు రూ.200 కోట్ల ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టడానికి చేతులు రావడం లేదని విమర్శించారు.
మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్‌లు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఏలేటి ధ్వజమెత్తారు. గన్నీ బ్యాగుల కొరతకు బంగ్లాదేశ్ యుద్ధానికి ముడిపెట్టడం హాస్యాస్పదమని చెప్పారు. రాష్ట్రంలో డీజిల్ కొరత లేదని అసెంబ్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబితే, డీజిల్ కొరత వల్లే లారీలు రావడం లేదని తుమ్మల సాకులు చెప్పడం వారి సమన్వయ లోపానికి నిదర్శనమని విమరించారు.
జూన్ 1వ తేదీ లోపు కళ్లాల్లో ఉన్న ప్రతి గింజను కొనుగోలు పూర్తి చేయాలని, లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో తదుపరి ఉమ్మడి కార్యాచరణ, పోరాట ప్రణాళిక ప్రకటిస్తామని, రాష్ట్ర ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
More Stories
కాలుష్య రహితంగా ‘స్వచ్ఛ గోదావరి – పవిత్ర పుష్కరాలు’
కరిగిపోతున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు
పంజాబ్ మున్సిపల్ ఎన్నికల్లో బలం పెంచుకున్న బీజేపీ