కాంగ్రెస్ పార్టీ మనస్తత్వమే హిట్లర్ మనస్తత్వం

కాంగ్రెస్ పార్టీ మనస్తత్వమే హిట్లర్ మనస్తత్వం
కాంగ్రెస్ పార్టీ మనస్తత్వమే హిట్లర్ మనస్తత్వం అని, రాజ్యాంగం, రాజ్యాంగ వ్యవస్థలు, ప్రజాస్వామ్య సంస్థల మీద కాంగ్రెస్ పార్టీకి నమ్మకం లేదని, అందుకే ఇందిరాగాంధీ గారు ఆనాడు దేశంలో ఎమర్జెన్సీ విధించారని, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు మండిపడ్డారు. ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీని ఒకే కుటుంబం నడుపుతోందని చెబుతూ అధ్యక్షుడు ఎవరైనా కావచ్చు, కానీ నిర్ణయాలు మాత్రం ఒకే కుటుంబం చుట్టూ తిరుగుతున్నాయని తెలిపారు. 
 
అదే నియంతృత్వ ధోరణిని తెలంగాణలో కూడా అమలు చేయాలని చూస్తున్నారని పేర్కొంటూ వారి తీరు చూస్తే “జో హిట్లర్ కి చాల్ చలేగా, ఓ హిట్లర్ కి మౌత్ మరేగా” అనే నినాదం గుర్తొస్తోందని ధ్వజమెత్తారు.  హిట్లర్ తరహా ఆలోచనలతో నడిచే ఏ రాజకీయ పార్టీ అయినా చివరికి ప్రజల తిరస్కారాన్నే ఎదుర్కొంటుంని ఆయన స్పష్టం చేశారు. 
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముల గురించి మాట్లాడిన తీరు పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ, భారతీయులకు గౌరవం ఇవ్వడంలో ఇబ్బంది పడుతూ, కాంగ్రెస్ కుటుంబానికి మాత్రం విధేయత చూపడం కాంగ్రెస్ నాయకత్వపు ఆలోచనా విధానాన్ని బయటపెడుతోందని దుయ్యబట్టారు. 

ఓబీసీ వర్గానికి చెందిన ప్రధానమంత్రి, గిరిజన మహిళ అయిన రాష్ట్రపతికి గౌరవం ఇవ్వడం కూడా ఇబ్బందిగా భావించడం సరైంది కాదని హితవు చెప్పారు.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఉదయం బీజేపీ, మధ్యాహ్నం బీజేపీ, రాత్రి బీజేపీ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని రామచందర్ రావు ధ్వజమెత్తారు.  కిషన్ రెడ్డి,  బండి సంజయ్ ల పేర్లు తప్ప మరో అంశం మాట్లాడటం లేదని చెబుతూ మోదీ గారి సభ విజయవంతమైన తర్వాత వచ్చిన నివేదికలతో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ బలపడుతోందనే విషయం కాంగ్రెస్‌కు స్పష్టమైందని తెలిపారు. అందుకే బీజేపీపై అసహనం, ఆందోళన పెరిగిందని చెప్పారు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ పేర్లు తప్ప కాంగ్రెస్ నాయకులకు మరో ఆలోచన కనిపించడం లేదు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వేగంగా బలపడుతుండటంతో కాంగ్రెస్ నాయకత్వంలో భయం పెరిగింది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు.  ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం దేశవ్యాప్తంగా సేకరించిన ధాన్యంలో 104.41 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే, అందులో తెలంగాణ నుంచే 55.31 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించారని చెప్పారు.

అంటే దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యంలో సగానికి పైగా తెలంగాణ నుంచే ఉందని స్పష్టం చేశారు. ఎంఎస్పీ కింద దేశవ్యాప్తంగా రైతులకు చెల్లించిన మొత్తం సుమారు రూ.21,243 కోట్లు కాగా, అందులో తెలంగాణ రైతులకు మాత్రమే రూ.13,171 కోట్లకు పైగా చెల్లింపులు జరిగాయని తెలిపారు.  ఎంఎస్పీ ప్రయోజనం పొందిన రైతుల సంఖ్య దేశవ్యాప్తంగా 11.69 లక్షల మంది కాగా, అందులో 7,79,358 మంది తెలంగాణ రైతులే అని స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెబుతోందని పేర్కొంటూ  ఎక్కడ కొనుగోలు చేశారో చెప్పమని సవాల్ చేశారు. మార్చి 25 నుంచే ప్రారంభం కావాల్సిన కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ 25 వరకు ప్రారంభించలేదని, అంటే దాదాపు నెల రోజులకు పైన రైతులను కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందిపెట్టారని విమర్శించారు.