2028 నాటికి అన్ని కోల్ బ్లాక్స్ మూసేస్తాం

2028 నాటికి అన్ని కోల్ బ్లాక్స్ మూసేస్తాం
యూపీఏ పాలనలో అవినీతిమయంగా ఉన్న బొగ్గు రంగాన్ని 12 ఏళ్లలో అనేక సంస్కరణలతో అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చామని చెబుతూ  2028 నాటికి అన్ని కోల్ బ్లాక్స్ మూసేస్తామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. క్రిటికల్ మినరల్స్ మిషన్‌ ప్రయోగానికి రూ.1,500 కోట్లు కేటాయిస్తామని పేర్కొంటూ అర్జెంటీనాలో 6 క్రిటికల్ మినరల్స్ బ్లాక్స్‌ తీసుకున్నామని, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ క్రియేట్ చేశామని తెలిపారు.
24 క్రిటికల్ మినరల్స్‌ను దిగుమతి చేసుకుంటున్నట్లు చెప్పారు. బొగ్గు వినియోగంలోనూ చైనా తర్వాత భారత్‌ రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు. బొగ్గు నిల్వలు ఉన్న దేశాల్లో భారత్‌ ఐదో స్థానంలో ఉందన్న కిషన్‌రెడ్డి కోల్‌ ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు ఉత్పత్తి కంపెనీ అని స్పష్టం చేశారు. ప్రస్తుతం 426 గనుల్లో బొగ్గు ఉత్పత్తి జరుగుతోందని, దేశ చరిత్రలో తొలిసారి బిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తితో రికార్డు సాధించామన పేర్కొన్నారు.
 
“బొగ్గు గనుల శాఖ ద్వారా నేరుగా 5 లక్షలు, పరోక్షంగా 25 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. రైల్వేకు 51 శాతం ఆదాయాన్ని బొగ్గు గనుల శాఖ ద్వారా కల్పిస్తున్నాం. దేశంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్తులో 72శాతం బొగ్గు ఆధారంగానే వస్తుంది. విద్యుత్తు కోతలు లేని నవ భారత నిర్మాణంలో బొగ్గు ప్రధాన భూమిక పోషించింది” అని కిషన్ రెడ్డి వివరించారు.
 
ప్రస్తుతం 189 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని చెబుతూ అండర్‌గ్రౌండ్ కోల్‌ గ్యాసిఫికేషన్‌పై అధ్యయనం చేస్తున్నామని, ఇందుకోసం ఈనెల 11న ప్రైవేట్ కంపెనీలతో చర్చించనున్నట్లు పేర్కొన్నారు.  కాంగ్రెస్ హయాంలో బొగ్గు అంటే అవినీతి, అసమర్థత కి కేరాఫ్ అడ్రస్ గా ఉండేవని,
కాంగ్రెస్ హయాంలో అవినీతి కారణంగా బొగ్గుమంత్రే జైలుకెళ్లారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ హయాంలో ఇచ్చిన కోల్‌ మైన్స్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసిందని తెలిపారు.
 
అనేక రకాల కీలక రంగాలకు కూడా బొగ్గు చాలా అవసరం అని చెబుతూ స్టీల్ ఉత్పత్తి, సిమెంట్, ఫర్టిలైజర్, స్పాంజ్ ఐరన్, కెమికల్స్ వంటి ప్రముఖ రంగాలకు బొగ్గు ప్రధానమైన ముడిపదార్ధం అని చెప్పారు. వివిధ రంగాల్లోనూ కోట్ల ఉద్యోగాలు కల్పించడంలో బొగ్గు కీలకమైన వనరు అని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత, ఇటీవల నెలకొన్న అంతర్జాతీయ ఉద్రిక్తల  నేపథ్యంలో మన దేశం ఎరువులు, గ్యాస్ ఉత్పత్తికోసం ఆత్మనిర్భరత సాధించడం కోసం కోల్ గ్యాసిఫికేషన్ చాలా కీలకం కానుందని కిషన్ రెడ్డి తెలిపారు.