టెలిఫోన్ చట్టం జోడించి ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు చార్జిషీట్

టెలిఫోన్ చట్టం జోడించి ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు చార్జిషీట్

* కీలక సాక్షులుగా విశ్రాంత డీజీపీ, మరో డీజీ

రాష్ట్రంలో సంచల నం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపు తిరగబోతున్నట్లు తెలిసింది. దర్యాప్తు పూర్తిచేసిన సిట్ అధికారులు త్వరలోనే కోర్టులో అదనపు చార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు తెలిసింది. ఈ తరుణంలో ఓ విశ్రాంత డీజీపీతో పాటు మరో డీజీని కీలక సాక్షులుగా చేర్చే దిశగా అడుగులు పడుతున్నట్లు తెలిసింది. కోర్టు విచారణ సమయంలో వీరిద్దరి వాంగ్మూలాలే కేసును మలుపు తిప్పే అవకాశంగా భావిస్తున్న సిట్‌, ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

వీరిలో ఒకరు సుదీర్ఘకాలం డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందగా, మరొకరు ఓ కీలక విభాగానికి అధిపతిగా ఉన్నారని తెలిపింది. గత ప్రభుత్వంలో వీరిద్దరు కీలక బాధ్యతల్లో ఉండటంతో పాటు ప్రధాన నిందితుడు ప్రభాకర్‌ రావు వీరిద్దరి వైపే వేలెత్తి చూపిస్తున్న నేపథ్యంలోనే సిట్ వీరిని సాక్షులుగా చేర్చడం అవశ్యమని భావిస్తున్నట్లు తెలిసింది. 

ఇప్పటికే ముగ్గురు బీఆర్ఎస్ ప్రముఖుల్ని కేసులో నిందితులుగా చేర్చాలని సిట్ నిర్ణయించినట్లు తెలుస్తుండగా, తాజా పరిణామానికి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ముగ్గురు ప్రముఖులపై అభియోగాలు మోపేందుకు వీరిద్దరి వాంగ్మూలాలు తప్పనిసరి అని సిట్ భావిస్తున్నట్లు తెలిసింది. వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్‌లో వీరి ప్రమేయం పెద్దగా లేకపోగా, ప్రభాకర్‌ రావు బృందమే పూర్తిగా నడిపించిందనే విషయం సిట్ గుర్తించినట్లు తెలుస్తోంది.

గత ప్రభుత్వంలో కీలక నేతల నుంచి నేరుగా ప్రభాకర్‌ రావు బృందానికే ఆదేశాలు అందేవని, అందుకు అనుగుణంగానే ఫోన్‌ ట్యాపింగ్ జరిగిందని సిట్ భావిస్తున్నట్లు తెలిసింది. అందుకే వీరిద్దరి విషయంలో పోలీస్ ఉన్నతాధికారులు వాంగ్మూలాల సేకరణకు అనుమతించడంలో జాప్యం నెలకొన్నట్లు తెలిసింది. అయితే ప్రభాకర్‌రావును లీగల్ ఇంటర్‌ సెప్షన్‌కు డిజిగ్నేటెడ్ అథారిటీగా నియమించడంలో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు సమాచారం.

అంతేకాకుండా ఫోన్‌ అక్రమ ట్యాపింగ్‌కు పాల్పడినా, నియంత్రించడంలో ఈ ఇద్దరు ఉన్నతాధికారులు విఫలమయ్యారనే వాదన తెరపైకి వచ్చింది. అప్పటి ప్రభుత్వ పెద్దల నిర్ణయానికి అడ్డు చెప్పలేక వీరిద్దరు మిన్నుకుండి పోవడంతోనే విచ్చలవిడిగా అక్రమ ట్యాపింగ్ చోటు చేసుకుందనే అంశం చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో వీరి వాంగ్మూలాలు నమోదు చేసేందుకు సిట్‌ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.  సిట్ అధికారులు ఇప్పటికే 600 మందికిపైగా నోటీసులు జారీచేసి స్టేట్‌మెంట్లను రికార్డు చేసింది.  

కాగా, ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయడంపై ఇప్పటివరకు సిట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. టెలిఫోన్ యాక్ట్ జోడించి చార్జిషీట్ వేయనున్నట్లు తెలిసింది. ఈ యాక్ట్‌ను జోడించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.