పైలట్ రోహిత్ రెడ్డి ఇచ్చిన రూ.34.23 లక్షల విలువైన చెక్ చెల్లకపోవడంతో నమోదైన క్రిమినల్ కేసులో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ పేర్కొంటూ హైదరాబాద్‌లోని ఫస్ట్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ మున్సిపల్ కోర్టు జడ్జి ఖుష్బూ ఉపాధ్యాయ్ ఈ తీర్పును వెలువరించారు. ఈ చెక్ బౌన్స్ కేసును ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఇంటెల్లిడెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున దాని ప్రతినిధి 2015లో దాఖలు చేశారు.
2015కు ముందు రోహిత్ రెడ్డి ఆ సంస్థకు డైరెక్టర్‌గా ఉన్న సమయంలో సంస్థ వనరులతోపాటు సిబ్బందిని తన పర్సనల్ బిజినెస్ వ్యవహారాలకు వినియోగించారని, దానివల్ల కంపెనీకి ఆర్థిక నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో ఆ సంస్థ ఆరోపించింది. కంపెనీ యాజమాన్యానికి ఈ వ్యవహారం తెలిసిన తర్వాత రోహిత్ రెడ్డిని ప్రశ్నించారని, ఆ తర్వాత అడ్వైజరీ ఫీజు మొత్తాన్ని చెల్లించేందుకు ఆయన అంగీకరించినట్లు కోర్టు తీర్పులో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే 2014 ఫిబ్రవరి 7వ తేదీన సంస్థ డైరెక్టర్ పదవికి పైలట్ రోహిత్ రెడ్డి రాజీనామా చేసినట్లు వెల్లడించింది.
ఆ తర్వాత ఆర్థిక బకాయిల పరిష్కారానికి ఒప్పందం కుదిరిందని, మొత్తం రూ.34.23 లక్షలు చెల్లించేందుకు అంగీకరించిన పైలట్ రోహిత్ రెడ్డి 2014 ఆగస్టు 1వ తేదీన అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు తీర్పులో ఉంది. ఈ మొత్తానికి సంబంధించి 2014 సెప్టెంబర్ 25వ తేదీన రోహిత్ రెడ్డి చెక్ జారీ చేసినట్లు కోర్టు పేర్కొంది. అయితే ఆ చెక్ 2014 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య 3 సార్లు బ్యాంకులో సమర్పించగా, అకౌంట్‌లో తగినంత నిధులు లేకపోవడంతో క్లియర్ కాలేదని తెలిపింది.
ఆ తర్వాత బకాయి మొత్తాన్ని చెల్లించాలని కోరుతూ పంపించిన న్యాయపరమైన నోటీసును స్వీకరించేందుకు రోహిత్ రెడ్డి నిరాకరించినట్లు ఫిర్యాదుదారు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో 2015లో క్రిమినల్ కేసు దాఖలైంది. విచారణ సమయంలో రోహిత్ రెడ్డి తరఫు న్యాయవాదులు కొన్ని కీలక పత్రాల చెల్లుబాటును ప్రశ్నించారు. ముఖ్యంగా ప్రామిసరీ నోట్‌పై సాక్షుల సంతకాలు లేవని, అలాగే కంపెనీ ప్రతినిధులు ఖాళీ ప్రామిసరీ నోట్, చెక్‌పై రోహిత్ రెడ్డి సంతకాలు తీసుకున్నారని వాదించారు.
అయితే ఈ వాదనలను కోర్టు అంగీకరించలేదు. కీలక పత్రాలపై ఉన్న తన సంతకాలను రోహిత్ రెడ్డి తిరస్కరించలేదని న్యాయస్థానం పేర్కొంది. అలాగే చెక్ హోల్డర్‌కు అనుకూలంగా నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్‌లోని సెక్షన్లు 118, 139 కల్పించే చట్టబద్ధమైన అనుమానాన్ని ఆయన సమర్థవంతంగా ఖండించలేకపోయారని కోర్టు అభిప్రాయపడింది. దీంతో ఖాతాలో తగినంత నిధులు లేక చెక్ తిరస్కరణకు గురైన కేసుల్లో వర్తించే నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ సెక్షన్ 138 కింద రోహిత్ రెడ్డిని దోషిగా కోర్టు నిర్ధారించింది.
తీర్పు వెలువరించే సమయంలో రోహిత్ రెడ్డి కోర్టుకు హాజరు కాలేదు. దీంతో న్యాయస్థానం ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దోషిగా నిర్ధారించిన తర్వాత శిక్షపై వాదనలు వినాల్సి ఉండటంతో, నిందితుడిని కోర్టులో హాజరుపరిచిన తర్వాతే శిక్షను ప్రకటిస్తామని జడ్జి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఈ కేసులో ప్రస్తుతానికి కోర్టు పైలట్ రోహిత్ రెడ్డిని దోషిగా నిర్ధారించినప్పటికీ, తుది శిక్ష ఎంత అన్నది ఆయన కోర్టులో హాజరైన తర్వాత జరిగే తదుపరి ప్రక్రియలో నిర్ణయించాల్సి ఉంది.

More Stories
జేపీఎస్సీ పరీక్ష రద్దుకు ఝార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం
`జెన్ జెడ్’ తప్పు దోవపట్టించే ప్రయత్నాలతో రాజీనామా చేశా!
పరీక్షలలో అక్రమాలపై ఫాస్ట్ ట్రాక్ కోర్టుల కోసం 158 సీబీఐ కేసులు సిద్ధం