జేపీఎస్‌సీ పరీక్ష రద్దుకు ఝార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం

జేపీఎస్‌సీ పరీక్ష రద్దుకు ఝార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం
 
* ఈడీ విచారణకు అంగీకారం.. సీబీఐ దర్యాప్తుపై ప్రతిష్టంభన 
 
రాష్ట్రంలో విద్యార్థులు 16 రోజుల పాటు చేపట్టిన నిరసనల నేపథ్యంలో, జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్‌సీ) ప్రాథమిక పరీక్షను రద్దు చేయడానికి జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సమాచారం. అవకతవకల ఆరోపణలు ఉన్న పాత పరీక్షా పత్రాలపై సిఐడి, ఈడి విచారణకు ఆదేశించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.  
పరీక్షలలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థులు చేస్తున్న ఆందోళన నేపథ్యంలో, వారితో ఆదివారం జరిపిన చర్చల అనంతరం జార్ఖండ్ ప్రభుత్వం మూడు పరీక్షలను రద్దు చేసే అవకాశం ఉందని ఈ విషయంపై ప్రత్యక్ష అవగాహన ఉన్న వ్యక్తులు తెలిపారు. ఈ మూడు పరీక్షలు: జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (జేపీఎస్‌సీ) 2023, 2025, 14వ ప్రిలిమినరీ అని ఆ వర్గాలు తెలిపాయి.
గత రెండు రోజులుగా ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వానికి, విద్యార్థి సంఘాలకు మధ్య జరిగిన చర్చలు ఒక పరిష్కారానికి రాలేకపోవడంతో ఈ సమావేశం జరిగింది.  విద్యార్థి నాయకుడు దేవేంద్ర నాథ్ మహతో ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతుండటంతో, ఆయన నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. పరీక్షల అవకతవకల కేసులో ఆర్థిక లావాదేవీలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) చేత తనిఖీ చేయించడానికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని ఆ వర్గాలు తెలిపాయి.
లక్నోకు చెందిన ప్రైవేట్ టెస్టింగ్ ఏజెన్సీ టీఎస్ఆర్ డేటా ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన అన్ని పరీక్షలను క్షుణ్ణంగా పరిశీలిస్తామని వారు తెలిపారు.  జేపీఎస్‌సీ, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (జెఎస్ఎస్ సి) లలో సంస్కరణలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐఎంఎం, ఎక్స్ ఐఎస్ఎస్ లను సంప్రదించి, వారి సహాయం తీసుకోనుంది. విద్యార్థుల డిమాండ్లలో చాలా వరకు ప్రభుత్వం అంగీకరించినప్పటికీ, అవకతవకలపై సిబిఐ విచారణ జరపాలన్న డిమాండ్ విషయంలో మాత్రం ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 
 
అభయ్ తివారీ హాజరైన అన్ని పరీక్షలను రద్దు చేయడానికి జార్ఖండ్ ప్రభుత్వం సుముఖంగా లేదని సమాచారం. పరీక్షల అవకతవకల కేసులో నిందితులలో ఒకరిగా ఉన్న తివారీ, గత 13 ఏళ్లలో 12 పరీక్షలలో ఉత్తీర్ణులయ్యారని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాలను ప్రధాన విద్యార్థి సంఘానికి తెలియజేయడంతో పాటు వారి అనేక డిమాండ్లను అంగీకరించింది. 90 రోజుల్లోగా ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తామని కూడా ప్రభుత్వం పేర్కొంది. 
 
ఇదిలా ఉండగా,  జేపీఎస్‌సీ  పరీక్షా అవకతవకలపై నిరసన తెలుపుతున్న విద్యార్థులకు “న్యాయం జరుగుతుందని”, అవకతవకలకు బాధ్యులైన వారికి “కఠిన శిక్ష” పడుతుందని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రకటించారు. “అసత్యంతో సత్యాన్ని కలగలిపి” యువతను “తప్పుదోవ పట్టిస్తున్న” ప్రతిపక్ష పార్టీలపై కూడా సోరెన్ మండిపడ్డారు. 
 
“మన యువత తమ హక్కుల సాధన కోసం నిరసనలు, ఆందోళనలు చేపడుతున్నారు. అక్రమాలను మేము బయటపెట్టడం వల్లే, వారు ముందుకు వచ్చి నిరసన తెలిపేందుకు, తమకు దక్కాల్సిన దానిని డిమాండ్ చేసేందుకు ధైర్యం పొందారు. యువతకు న్యాయం జరుగుతుంది. అవకతవకలకు బాధ్యులైన వారికి అత్యంత కఠినమైన శిక్ష పడుతుంది. ఈ విషయాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు లేదా రాజకీయ అండదండలు కోరాల్సిన పనిలేదు,” అని సోరెన్ ఒక బహిరంగ సభలో పేర్కొన్నారు. 
 
ప్రతిపక్ష పార్టీలు యువతను “తప్పుదోవ పట్టిస్తున్నాయని” ఆరోపిస్తూ “కొంతమందికి భారీ రాజకీయ ఆశయాలు ఉంటాయి. ఈ ఆశయాలే రాజకీయ పార్టీలు యువతను తప్పుదోవ పట్టించడానికి ఒక మార్గాన్ని కల్పిస్తాయి. యువతకు మా రాజకీయ అండగానీ, లేదా మరే ఇతర రాజకీయ పార్టీ మద్దతుగానీ అవసరం లేదని నేను ప్రత్యేకంగా చెబుతున్నాను” అని స్పష్టం చేశారు. 
 
“మీకు దక్కాల్సినవి పొందడం, న్యాయం పొందడం మీ హక్కు. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు యువతపై దృష్టి సారిస్తున్నాయి. నిజానిజాలను కలిపి చెప్పడం ద్వారా వారిని ఎలా తప్పుదోవ పట్టించాలనే వ్యూహాలను రచిస్తున్నాయి. అత్యంత విద్యావంతులు, జ్ఞానవంతులు కూడా ఇందులో భాగస్వాములవుతూ, ఈ పనిని భారీ స్థాయిలో చేస్తున్నారు,” అని ఆయన తెలిపారు.