పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదివారం నాడు ఉత్తర 24 పరగణాల జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు నిరసనలను ఎదుర్కొన్నారు. మరణించిన తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) కార్యకర్త నివాసానికి వెళ్తుండగా బిజ్‌పూర్ వద్ద ఈ ఘటన జరిగింది. అక్కడ నిరసనకారుల బృందం ఆమె వాహనాన్ని చుట్టుముట్టి, “చోర్” (దొంగ) అని నినాదాలు చేయడమే కాకుండా, ఆమె కారుపై రాళ్లు, బురద విసిరారని ఆరోపణలు వచ్చాయి.
తన వాహనంపై రాళ్లు, బూట్లు, బురదతో దాడి జరిగిందని బెనర్జీ ఆరోపించారు. తన పర్యటన గురించి సమాచారం ఇచ్చినప్పటికీ, తగిన భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు విఫలమయ్యారని ఆమె విమర్శించారు. “నా కారుపై రాళ్లు, బూట్లు, బురదతో దాడి చేశారు. ఇది కేవలం ఒక కుట్ర. నేను వస్తున్నట్లు పోలీసులకు సమాచారం ఇచ్చాను. అయినప్పటికీ వారు ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోలేదు. మొత్తం పశ్చిమ బెంగాల్‌ను దుండగులు నియంత్రిస్తున్నారు,” అని బెనర్జీ విలేకరులతో పేర్కొన్నారు.
పోలీసు సిబ్బంది సమక్షంలోనే తన వాహనంపై పెద్ద రాళ్లు విసిరారని, ఈ దాడి వల్ల తీవ్ర గాయాలు అయ్యే అవకాశం ఉండేదని ఆమె పేర్కొన్నారు. “సామాజిక వ్యతిరేక శక్తులు పోలీసుల కళ్ల ముందే నా కారుపై పెద్ద రాళ్లు విసిరాయి. వాహనంపై దాడి ఎంత తీవ్రంగా ఉందంటే, ఒకవేళ కిటికీలు తెరిచి ఉంటే నా తల పగిలిపోయేది. మేమంతా చనిపోయేవాళ్లం. ఇదంతా పోలీసుల కళ్ల ముందే జరిగింది. ఇలాంటిది నేనెప్పుడూ చూడలేదు. అసలు ఏం జరుగుతోంది? పోలీసులు బీజేపీకి రక్షణ కల్పిస్తున్నారు,” అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవంక, శాంతియుతమైన ఆ ప్రాంతంలో గందరగోళం సృష్టించడానికి బెనర్జీ వచ్చారని నిరసనకారులు ఆరోపించారు. నిరసన సందర్భంగా ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హలిసహర్ పోలీసుల అదుపులో ఉన్నప్పుడు అనారోగ్యానికి గురై ఆ టిఎంసి కార్యకర్త మరణించారని ఆరోపణలు ఉన్నాయి.
పార్టీ కార్యకర్తల హింసాత్మక చర్యలను ఎప్పుడూ సహించబోమని చెబుతూ వచ్చిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య, మాజీ ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని ఖండించారు. ఘటనతో బీజేపీకి ఎటువంటి సంబంధం లేదని పేర్కొంటూ నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం తర్వాత, తృణమూల్ ఎంపీ, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ తన సొంత నియోజకవర్గంలో దాడికి గురైన కొన్ని నెలలకే ఈ తాజా దాడి ఘటన చోటుచేసుకుంది.

More Stories
జేపీఎస్సీ పరీక్ష రద్దుకు ఝార్ఖండ్ ప్రభుత్వం సిద్ధం
`జెన్ జెడ్’ తప్పు దోవపట్టించే ప్రయత్నాలతో రాజీనామా చేశా!
నదీ జలాల డేటా చైనా చెప్పాల్సిందే.. భారత్ స్పష్టం