హమీద్ అన్సారీ `హిందూ మితవాద మతతత్వం’ వాఖ్యల దుమారం 

హమీద్ అన్సారీ `హిందూ మితవాద మతతత్వం’ వాఖ్యల దుమారం 
 
మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ `హిందూ మితవాద మతతత్వం’ అంటూ చేసిన వాఖ్యలపై బిజెపి, విశ్వహిందూ పరిషత్ నేతలు భగ్గుమన్నారు. 
మాజీ రాష్ట్రపతి తన పదవికి తగిన గౌరవాన్ని కాపాడుకోవడంలో విఫలమయ్యారని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు.  అన్సారీ వ్యాఖ్యలు ‘దురదృష్టకరమైనవి, ‘నిజంగా భయానకమైనవి’ అని అభివర్ణించారు. 
 
“భారతదేశానికి అసలైన ప్రమాదం కమ్యూనిజం కాదు, హిందూ మితవాద మతతత్వమే” అని మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేసిన ప్రకటనను అన్సారీ ఉటంకించారు. నూరానీ స్మారకార్థం ఇండియా ఇస్లామిక్ కల్చరల్ సెంటర్‌లో మాట్లాడుతూ, పౌర జాతీయవాదాన్ని సవాలు చేస్తున్నాయని తాను అభివర్ణించిన కొత్త పోకడలను అన్సారీ ప్రముఖంగా ప్రస్తావించారు. కమ్యూనిజం కంటే ‘కు హిందూ మితవాద మతతత్వం’ భారతదేశానికి పెద్ద ముప్పు అని మాజీ ఉపరాష్ట్రపతి వ్యాఖ్యానించడం పెద్ద దుమారం రేపింది. 
గ్రేటర్ నోయిడాలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆదిత్యనాథ్, అన్సారీ వ్యాఖ్యలు భారతదేశానికి, భారతీయ సంస్కృతికి వ్యతిరేకమని విమర్శించారు. 
ప్రపంచ వేదికపై దేశ ప్రతిష్టను దెబ్బతీసే ఎజెండాలో భాగంగానే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని ముఖ్యమంత్రి ఆరోపించారు. శనివారం జరిగిన ‘ఏజీ నూరాని మెమోరియల్ ప్రసంగం’లో ప్రసంగిస్తూ,
 
“ఒక ముఖ్యమైన రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఎల్లప్పుడూ ఆ పదవికి తగిన గౌరవంతో ప్రవర్తించాలని భారతదేశం, భారత రాజ్యాంగం ఆశిస్తాయి,” అని ఆదిత్యనాథ్ హితవు చెప్పారు. “ఆయన వ్యక్తిగత అభిప్రాయం వేరుగా ఉండవచ్చు. కానీ భారతదేశం విషయానికి వస్తే, భారత రాజ్యాంగ పవిత్రతను పాటిస్తూనే, దేశ సమగ్రత, ఐక్యతకు అత్యుత్తమ సహకారం అందించడం ముఖ్యం” అని స్పష్టం చేశారు. 
 
ఈ సందర్భంగా, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శనివారం జరిగిన ‘ఛాత్రోన్ కి గూంజ్’ (విద్యార్థుల గళం) కార్యక్రమంలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ‘కాంగ్రెస్ యువరాజు’ మహిళలను అవమానించారని, ఇది ఆ పార్టీ సంస్కృతిని మరోసారి బయటపెట్టిందని ఆయన విమర్శించారు.  భారతదేశ హిందూ సంప్రదాయాన్ని ఉగ్రవాదంతో ముడిపెట్టారని అన్సారీపై యోగి ఆరోపించారు.
 
ఒక ర్యాలీలో వృద్ధురాలికి కుర్చీ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహరించిన తీరును ఉద్దేశించి, రాహుల్ గాంధీ, స్టాండప్ కమెడియన్ పుల్కిత్ మణి చేసిన వ్యాఖ్యలను ఆదిత్యనాథ్ ప్రస్తావించారు. కాంగ్రెస్, దాని నాయకుల నుండి ప్రజలు ఇక ఏమీ ఆశించకూడదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు.
 
“వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు లేదా మనకంటే పెద్దవారు ఎవరైనా ఉన్నప్పుడు, మనం వారిని ముందు వెళ్లమని కోరతాము లేదా సీటు ఉంటే వారికి ఆ సీటును ఇస్తాము,” అని ఆయన తెలిపారు. “ఇదే మన సంస్కృతి; ఇదే మన జీవన విధానం” అని తెలిపారు.  అయితే, ఈ సంప్రదాయాలు నేర్చుకోని వారికి, ఈ విలువలు లేని వారికి, భారతదేశాన్ని, భారతీయతను అవమానించడమే తమ ఏకైక లక్ష్యంగా పెట్టుకున్న వారికి ‘వసుధైవ కుటుంబకం’ (ప్రపంచమే ఒక కుటుంబం) అనే భావనను అర్థం చేసుకునే సామర్థ్యం ఉంటుందని ఆశించడం వృథా అంటూ ఆదిత్యనాథ్ దుయ్యబట్టారు. 
విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి), “హిందూ మితవాద మతతత్వం”పై మాజీ ఉపాధ్యక్షుడు మహమ్మద్ హమీద్ అన్సారీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా విరుచుకుపడింది. ఆయన అభిప్రాయాలు “హిందూ ద్వేషపూరిత, నెహ్రూవాద, తీవ్రవాద మనస్తత్వాన్ని” ప్రతిబింబిస్తున్నాయని ఆరోపించింది. భారతదేశంలోని మెజారిటీ హిందూ సమాజాన్ని “భారతదేశానికి ముప్పు”గా అభివర్ణించే ముందు, అన్సారీ తన సొంత ప్రజా జీవితం అనే “అద్దంలో” చూసుకోవలసిందని విహెచ్‌పి జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సల్ హితవు చెప్పారు. 
 
ఆయన వ్యాఖ్యలపై స్పందిస్తూ, బన్సల్ ఎక్స్ లో ఇలా పేర్కొన్నారు, “ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నప్పుడు పీఎఫ్‌ఐకి సంబంధించిన కార్యక్రమాలలో మీ ఉనికి, మరియు రాయబారిగా ఉన్న సమయంలో జాతీయ ప్రయోజనాలను దెబ్బతీసిన అనేక మచ్చలు ఉన్నప్పటికీ, ఈ రోజు మీరు హిందువులకు మతతత్వంపై ఉపన్యాసాలు ఇస్తున్నారా? గుర్తుంచుకోండి, హిందువులు నిజంగా మతతత్వవాదులైతే, ఇలాంటి ప్రకటన చేసే ధైర్యం మీకు ఉండేది కాదు.”  
 
 “భారతదేశం మీకు పదవి, గౌరవం, డబ్బును ఇచ్చింది. ఇకనైనా దాన్ని అవమానించడం మానేయండి”: హమీద్ అన్సారీకి వీహెచ్‌పీ నేత  హితవు చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన “హిందూ వ్యతిరేక రాజకీయాలను” ఈ వ్యాఖ్యలు వెలుగులోకి తెచ్చాయని బీజేపీ షెడ్యూల్డ్ తెగల మోర్చా పేర్కొంది. హిందూ సంస్థలు, ఉగ్రవాదంపై రాహుల్ గాంధీ గతంలో చేసిన వ్యాఖ్యలను కూడా ఆ పార్టీ విభాగం ప్రస్తావించింది. అటువంటి వ్యాఖ్యలు ఆ పార్టీ రాజకీయ విధానంలోని ఒక నిర్దిష్ట ధోరణిని ప్రతిబింబిస్తున్నాయని ఆరోపించింది.
 

రాహుల్ గాంధీ సూచనల మేరకే ఆ వ్యాఖ్యలు చేశానని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ ఆరోపించారు. “2009లో రాహుల్ హిందూ సంస్థలను లష్కర్-ఏ-తొయిబా (ఎల్ఈటి) కంటే పెద్ద ముప్పుగా అభివర్ణించారు… కాంగ్రెస్ ఉగ్రవాద అనుకూల, హిందూ వ్యతిరేక పార్టీ,” అని ఆయన ధ్వజమెత్తారు.   ఆ పార్టీని “ఆధునిక భారత ముస్లిం లీగ్” అని అభివర్ణించారు.

 
కాంగ్రెస్, దాని అనుబంధ సంస్థలు విదేశీ దురాక్రమణదారులను ఆదర్శంగా భావిస్తాయని, హిందూ వ్యతిరేక నిరంకుశులను కీర్తిస్తాయని బీజేపీ పేర్కొంది. 
ఎక్స్ పై అన్సారీ చేసినట్లుగా భావిస్తున్న వ్యాఖ్యల వీడియో ఫుటేజీని పంచుకుంటూ, సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసి, అపవిత్రం చేసిన ఘజ్నీని “స్తుతించినందుకు” మాజీ ఉపరాష్ట్రపతిపై షెహజాద్ పూనావాలా విమర్శలు గుప్పించారు.