ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికలలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) అధ్యక్ష, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులను గెలుచుకోవడంపై బిజెపి హర్షం వ్యక్తం చేసింది. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఎస్‌యుఐ) ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోవడంతో కాంగ్రెస్‌ను ఎద్దేవా చేస్తూనే, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ విజయాన్ని “చాలా ముఖ్యమైనది, లోతైన సంకేతాన్నిచ్చేది” అని అభివర్ణించారు.
ఎబివిపికి అభినందనలు తెలుపుతూ, కాంగ్రెస్ వాదనలు ఘోరంగా విఫలమయ్యాయని ఆయన పేర్కొన్నారు. “‘యూత్ కి గూంజ్” (యువత గళం) అనే వాదనను విద్యార్థులు స్పష్టంగా, గట్టిగా తిరస్కరించారు. ఒక రకంగా చెప్పాలంటే, ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికలు యువత నిజమైన గళాన్ని ప్రతిబింబించే ప్రజాభిప్రాయ సేకరణ (రెఫరెండం) లాంటివి,” అని ఆయన విలేకరులతో తెలిపారు.
విజేత అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ, ఎబివిపి విజయం ఒక చారిత్రాత్మక ఘట్టమని బీజేపీ ఢిల్లీ విభాగం అధ్యక్షుడు హర్ష్ మల్హోత్రా పేర్కొన్నారు. ఎన్నికలలో ఎన్‌ఎస్‌యుఐ పనితీరును ప్రస్తావిస్తూ కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకున్న ఆయన, ‘తుక్డే-తుక్డే గ్యాంగ్’ ప్రతికూల రాజకీయాలను యువత తిరస్కరించిందని స్పష్టం చేశారు. “ఈ విజయం జాతీయవాద భావజాలానికి, 2047 నాటికి ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారత్) సాధించాలన్న ప్రధానమంత్రి దార్శనికతకు దక్కిన విజయం,” అని ఆయన చెప్పారు.
“యువ, అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యంగా సాగుతున్న ప్రధాని నరేంద్ర మోదీ విధానాలకు, జాతీయవాదానికి తాము కట్టుబడి ఉన్నామని ఢిల్లీ విద్యార్థులు నిరూపించారు,” అని స్పష్టం చేశారు. బీజేపీ నేత వీరేంద్ర సచ్‌దేవా కూడా ఎబివిపి విజయాన్ని ప్రశంసించారు. ఇది భారతీయ యువత యొక్క నిజమైన ఆలోచనా విధానాన్ని తెలియజేస్తుందని పేర్కొన్నారు.
యువతలో ఎటువంటి గందరగోళం లేదని, ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశ భవిష్యత్తు సురక్షితమైన చేతుల్లో ఉందని వారికి తెలుసని ఆయన చెప్పారు. “‘అబద్ధాల హోరు’ ఎక్కువ కాలం నిలవదని వారు గ్రహించారు. రాహుల్ గాంధీ గారూ, మీరు కార్యక్రమాలకు హాజరవుతూ ఉండవచ్చు, కానీ అంతిమంగా భారతీయ యువత ప్రధాని మోదీకి గట్టి మద్దతుగా నిలుస్తారు,” అని ఆయన ఒక వీడియో సందేశంలో తెలిపారు.

More Stories
ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేతలుగా క్రీడాకారులు
ఎస్ఐఆర్ లో లోపాలు గుర్తించిన జాబితాలో ఢిల్లీ సీఎం, మాజీ సీఎం
కీలక నేవీ అకాడమీలో పనిచేస్తున్న బంగ్లాదేశ్ వ్యక్తి అరెస్ట్