దేశ రక్షణలో కీలకమైన నేవీ అకాడమీలో బంగ్లాదేశీయుడైన వ్యక్తి నకిలీ భారతీయ గుర్తింపు కార్డు, ఇతర నకిలీ ధృవీకరణ పత్రాలతో కాంట్రాక్ట్ ఉద్యోగం పొంది పనిచేస్తున్నట్లు వెల్లడి కావడంతో నేవీ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించగా అరెస్ట్ చేశారు. కేరళలోని అత్యంత సున్నితమైన ఎజిమల నావల్ అకాడమీలో ఈ సంఘటన జరిగింది.
32 ఏళ్ల బిప్లోబ్ సోరెన్ గత ఏడాదిగా ఆ నేవీ అకాడమీలోని లాండ్రీ విభాగంలో కాంట్రాక్ట్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఆ వ్యక్తి ప్రవర్తనపై నేవీ అధికారులకు అనుమానం కలగడంతో అతడిపై నిఘా ఉంచారు. ఆ తర్వాత అదుపులోకి తీసుకుని విచారించారు. బిప్లోబ్ సోరెన్ బంగ్లాదేశ్ పౌరుడని సూచించే పత్రాలు, ఇతర సమాచారాన్ని అతడి మొబైల్ ఫోన్‌లో అధికారులు గుర్తించారు.
నకిలీ భారతీయ గుర్తింపు కార్డు, ఇతర నకిలీ ధృవీకరణ పత్రాలతో అతడు కాంట్రాక్ట్ ఉద్యోగం పొందినట్లు గ్రహించారు. సరైన పత్రాలు లేకుండా భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి స్థానిక పోలీసులకు అప్పగించగా అతడ్ని అరెస్ట్ చేశారు. మరోవైపు వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన రక్షణ సంస్థలో ఒక విదేశీ వ్యక్తి దాదాపు ఏడాది పాటు కాంట్రాక్ట్ కార్మికుడిగా ఎలా పనిచేయగలిగాడు? అన్న దానిపై పలు ప్రశ్నలు వ్యక్తమయ్యాయి.
బంగ్లాదేశీ జాతీయుడు నకిలీ పత్రాలు ఎలా సంపాదించాడు? కీలకమైన రక్షణ సంస్థలోకి ఎలా ప్రవేశం పొందాడు? అతడి ఉద్యోగానికి ఎవరు సహకరించారు? ఇతర భద్రతాపరమైన లోపాలు ఏమైనా ఉన్నాయా? అన్నది పోలీసులు, నేవీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

More Stories
`యూత్ కి గూంజ్’ వాదనను తిరస్కరించిన విద్యార్థులు.. బిజెపి
ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేతలుగా క్రీడాకారులు
ఎస్ఐఆర్ లో లోపాలు గుర్తించిన జాబితాలో ఢిల్లీ సీఎం, మాజీ సీఎం