తమిళనాడులోని తిరుప్పరంకుండ్రం కార్తీక దీపం వివాదంపై నవంబరు 24న పౌర్ణమి రోజు కొండపై కార్తీక దీపాన్ని వెలిగించేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. అయితే, రాత్రి స్తంభం వద్ద దీపం వెలిగించే ఆచారాన్ని పునరుద్ధరించాలన్న ఆదేశాలను సమర్థిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పులోని కొన్ని భాగాలపై జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ ఎం పంచోలీలతో కూడిన ధర్మాసనం స్టే విధించింది.
కొండ పైభాగం యాజమాన్య హక్కులు, ఈ ఆచారం నిర్వహించే ప్రదేశంపై హిందూ భక్తులు, హజ్రత్ సుల్తాన్ సికిందర్ బదుషా ఔలియా దర్గా మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ మధ్యంతర అనుమతులు ఇచ్చింది. కొండ పైభాగం మొత్తం తమదేనని, రాతి స్తంభం వద్ద దీపం వెలిగించాలన్న డిమాండ్‌ను వ్యతిరేకిస్తున్నామని గురువారం అత్యున్నత న్యాయస్థానం ఎదుట దర్గా తరపున వాదనలు వినిపించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
విచారణ అసంపూర్తిగా మిగిలిపోవడంతో, శుక్రవారం కూడా కొనసాగించాలని కోర్టు నిర్ణయించింది. దర్గా తరపున హాజరైన సీనియర్ న్యాయవాది అమిత్ ఆనంద్ తివారీ, 1920లో ఒక సివిల్ దావాలో జారీ అయిన కోర్టు ఉత్తర్వులను ప్రస్తావిస్తూ, నెల్లితోపు నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గం ఆ దర్గాకు చెందినదని ఆ తీర్పులో నిర్ధారించారని పేర్కొన్నారు.
‘‘కొండ పైభాగం మొత్తం దర్గాకు చెందినది. దర్గాకు, రాతి స్తంభానికి మధ్య ఎంత దూరం ఉన్నప్పటికీ, ఆ రాతి స్తంభం ఉన్న కొండపైభాగంలో దీపం వెలిగించే ప్రసక్తే లేదు’’ అని తివారీ తెలిపారు. మసీదు, ధ్వజస్తంభం ఉన్న కొండపైభాగంతో పాటు రాతి స్తంభం ఉన్న ప్రదేశం కూడా దర్గా ఆస్తియేనని ఆయన కోర్టుకు నివేదించారు.
మదురై సమీపంలో తిరుప్పరంకుండ్రంలోని అరుల్మిగు సుబ్రమణ్యస్వామి ఆలయంలో సంప్రదాయ కార్తీక దీపం వెలిగించే వేడుక ఎక్కడ జరగాలనే దానిపై ఈ వివాదం నెలకుంది. దశాబ్దాలుగా, కొండ దిగువ ప్రాంతంలో ఉన్న ఉచ్చిపిళ్లైయార్ ఆలయానికి సమీపంలోని ‘దీప మండపం’ వద్ద దీపాన్ని వెలిగిస్తున్నారు. అయితే, కొండ పైభాగంలో దర్గాకు సుమారు 50 మీటర్ల దూరంలో ఉన్న పురాతన రాతి స్తంభం ‘దీపతూణ్’ వద్ద దీపం వెలిగించేందుకు అనుమతి ఇవ్వాలని హిందూ సంఘాలు కోరుతున్నాయి.
ఈ ఆచారం నిర్వహించే ప్రదేశం, కొండ యాజమాన్య హక్కులపై ఈ వివాదం న్యాయపోరాటానికి దారితీసింది. దర్గా సమీపంలో దీపం వెలిగించేందుకు అనుమతిస్తే విస్తృతమైన న్యాయ, పరిపాలనాపరమైన చిక్కులు తలెత్తుతాయని పేర్కొంటూ తమిళనాడు ప్రభుత్వం ఈ డిమాండ్‌ను వ్యతిరేకించింది. ఈ ఆచారానికి అనుమతిస్తే, దేశవ్యాప్తంగా ఉన్న వేలాది సర్వే స్తంభాలకు మతపరమైన గుర్తింపు వచ్చే ప్రమాదం ఉందని బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది.
మద్రాస్ హైకోర్టు అనుసరించిన విధానాన్ని కూడా దర్గా కమిటీ సవాలు చేసింది. హైకోర్టు నిబంధనల ప్రకారం కౌంటర్ దాఖలు చేయడానికి దర్గాకు తగినంత సమయం ఇవ్వకుండానే సింగిల్ జడ్జి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసిందని కమిటీ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది హుజెఫా అహ్మదీ వాదించారు. ఉత్తర్వులు జారీ చేసే ముందు న్యాయమూర్తి దర్గాకు సమాచారం ఇవ్వకుండానే ఆ ప్రదేశాన్ని సందర్శించారని కూడా ఆయన పేర్కొన్నారు.
ఆలయాన్ని, మొత్తం తిరుప్పరంకుండ్రం కొండను భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) నియంత్రణలోకి తీసుకురావాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకించింది. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడ్‌విట్‌పై తమిళనాడు దేవాదాయ శాఖ కమిషనర్ టీజీ వినయ్ మాట్లాడుతూ ఆలయ యాజమాన్య హక్కులు, ప్రస్తుత మతపరమైన ఆచారాలు దశాబ్దాల న్యాయ ప్రక్రియల ద్వారా పరిష్కారమైనట్టు తెలిపారు.
1923 సివిల్ కోర్టు డిక్రీ ద్వారా గుర్తించిన మేరకు ఈ కొండ అరుల్మిగు సుబ్రమణ్యస్వామి ఆలయానికి చెందినదని, దానిని 1931లో ప్రివీ కౌన్సిల్ పునరుద్ధరించిందని ఆయన స్పష్టం చేశారు. పిటిషనర్ ‘హిందూ ధర్మ పరిషత్’ కోరిన మూడు అంశాలను వ్యతిరేకించింది: మొత్తం ఆలయం, కొండను ఏఎస్ఐకి అప్పగించడం, దీపతూణ్గా పిలువబడే రాతి స్తంభం వద్ద నిరంతరం దీపం వెలిగేలా చూడటం, కార్తీక దీపం సందర్భంగా కొండ మొత్తాన్ని దీపాలతో అలంకరించడం.
‘‘ఇలా పరిష్కరించిన యాజమాన్య హక్కులను కదిలించలేం. చట్టబద్ధంగా దేవాదాయ, ధర్మాదాయ శాఖకు అప్పగించిన ఒక ధార్మిక సంస్థ నిర్వహణను, ఎలాంటి న్యాయపరమైన ఆధారం లేకుండా, ఇప్పటికే ముగిసిన సివిల్ తీర్పునకు విరుద్ధంగా దాఖలైన పిటిషన్ ఆధారంగా లాక్కుని ఏఎస్ఐకి అప్పగించలేం’’ అని ఆ అఫిడవిట్ పేర్కొంది.
More Stories
యూపీ ఎన్కౌంటర్లో దావూద్ అనుచరుడు నసీమ్ దుర్రానీ హతం
తమిళనాడు పెట్టుబడుల వివరాలు ఆంధ్రాకు లీక్?
అయోధ్యలో పోటీకి సిద్ధమా? అఖిలేష్ కు యోగి సవాల్