ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేతలుగా క్రీడాకారులు 

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం నేతలుగా క్రీడాకారులు 

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘంకు జరిగిన ఎన్నికలలో ఎన్నికైన ముగ్గురు ఎబివిపి అభ్యర్థులలో ఇద్దరు ప్రముఖ క్రీడాకారులు. అధ్యక్షునిగా ఎన్నికైన  యశ్ దాబాస్ అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు  కాగా, కార్యదర్శిగా ఎన్నికైన  రియా ఛావ్‌డి బాస్కెట్ బాల్ క్రీడాకారిణి.  ఢిల్లీలోని కంఝవాలాలో పెరిగిన దాబాస్, విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా ఉంటూ వచ్చారు. క్యాంపస్ రాజకీయాల్లోకి రాకముందు, ఆయన టెన్నిస్ క్రీడలో రాణించారు.

‘ఆల్ ఇండియా’, ‘ఖేలో ఇండియా’ యూనివర్సిటీ క్రీడలలో ఢిల్లీ యూనివర్సిటీకి ప్రాతినిధ్యం వహించారు. అలాగే స్పెయిన్, ఆస్ట్రేలియా, సెర్బియా వంటి దేశాలలో జరిగిన ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటిఎఫ్) పోటీలలో కూడా పాల్గొన్నారు.  విద్యాపరంగా, దాబాస్ శ్రీ గురు తేగ్ బహదూర్ ఖల్సా కాలేజీలో తన అండర్ గ్రాడ్యుయేట్ విద్యను పూర్తి చేసి, ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలోని క్యాంపస్ లా సెంటర్‌లో న్యాయశాస్త్రం అభ్యసించారు. ప్రస్తుతం ఆయన అదే యూనివర్సిటీలో బౌద్ధ అధ్యయనాలలో మాస్టర్స్ డిగ్రీని చేస్తున్నారు. 

తన విజయంపై స్పందిస్తూ యశ్ ఇలా తెలిపారు: “ఇది సామరస్యం, దేశభక్తి, సంఘ్ సమిష్టి శక్తికి దక్కిన విజయం. పియు స్థాయి నుండి డియు స్థాయి వరకు ఉన్న విద్యాసంస్థల విద్యార్థులు మా విజయం కోసం కృషి చేశారు. క్యాంపస్ నుండి  ఎన్‌ఎస్‌యుఐ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.  ఎన్‌ఎస్‌యుఐ 4-0 తేడాతో ఓడిపోయింది. ప్రతి పిజి, హాస్టల్‌కు భద్రతా తనిఖీ నిర్వహించేలా చూడటమే మా ప్రధాన లక్ష్యం.”

“సత్య నికేతన్‌లో జరిగిన ప్రమాదాన్ని మనమందరం చూశాము. భవిష్యత్తులో ఎవరికీ అలాంటి సంఘటన జరగకూడదని మేము కోరుకుంటున్నాము. ప్రతి కళాశాల, హాస్టల్, పిజిలకు భద్రతా తనిఖీలు నిర్వహించడమే మా మొదటి ప్రాధాన్యత. గతసారి విద్యార్థి పరిషత్ 3-1 తేడాతో గెలిచింది, ఈసారి కూడా 3-1 తేడాతోనే విజయం సాధించింది. తదుపరిసారి మేము 4-0 తేడాతో విజయం సాధిస్తాం,” అని ఆయన భరోసా వ్యక్తం చేశారు.

ఎన్నికల ప్రచారంలో, దబాస్ విద్యార్థుల భద్రత, వసతిని కీలక అంశాలుగా ప్రస్తావించారు. మహిళల భద్రతపై కూడా దబాస్ ఆందోళన వ్యక్తం చేశారు. కళాశాలలు, మహిళా హాస్టళ్ల బయట ‘పింక్ బూత్‌ల’ ఏర్పాటు, భద్రత కోసం 1,000కి పైగా సీసీటీవీ కెమెరాల ఏర్పాటు వంటి చర్యలను ప్రతిపాదించారు. అలాగే, కళాశాల విద్యార్థులకు సురక్షితమైన, అందుబాటు ధరలో ఉండే వసతి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. 

కార్యదర్శిగా గెలుపొందిన ఎబివిపికి చెందిన రియా ఛావ్‌డి తన విజయంపై స్పందిస్తూ ఈ విధంగా పేర్కొన్నారు: “ఈ విజయంతో నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఏకైక మహిళా అభ్యర్థిగా, నా పదవీకాలంలో విద్యార్థుల కోసం నా శక్తిమేర కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మేము ఒక విద్యార్థి సంఘం. మేము రాజకీయ ఎజెండాలపై దృష్టి పెట్టము. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడమే మా లక్ష్యం. అందుకే విద్యార్థులు మాపై నమ్మకం ఉంచారు. దీని ఫలితంగా ఎబివిపి మూడు స్థానాలను గెలుచుకుంది”. 

“అన్నిటికంటే ముఖ్యంగా, మహిళల భద్రతకు నేను అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని నొక్కి చెబుతున్నాను. అంతేకాకుండా, మహిళల భద్రత, పిజిల (పేయింగ్ గెస్ట్ వసతులు) తనిఖీలు లేదా క్యాంపస్ భద్రత… ఇలా మా మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలన్నింటినీ నెరవేర్చడానికి మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాము” అని ఆమె చెప్పారు.