నన్ను ఆపేటోడు తెలంగాణ గడ్డపై పుట్ట లేదు

నన్ను ఆపేటోడు తెలంగాణ గడ్డపై పుట్ట లేదు

* లాల్‌బహదూర్ స్టేడియంలో “24 గంటల కౌంట్‌డౌన్ టు యోగా డే”

“నన్ను ఆపేటోడు తెలంగాణ గడ్డపై పుట్ట లేదు. నేను మీలాగ పది పార్టీలు మారలేదు..” అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై విరుచుకు పడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని పొలిమేరలో అడుగు పెట్టనివ్వమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్జి శనివారం చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ప్రతిస్పంచారు.  

“నేనెవరో నేనేంటో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడే వ్యక్తిని కాదు. పన్నెండు పార్టీలు తిరిగి బీజేపీ పార్టీలోకి వచ్చిన వ్యక్తిని కాదు” అంటూ ఎద్దేవా చేశారు.  బీజేపీలోనే పుట్టి, ఈ పార్టీలోనే రాజకీయ జీవితాన్ని ప్రారంభించానని, బీజేపీ లోనే కొనసాగుతానని తేల్చి చెప్పారు.  వ్యక్తిగత స్థాయికి దిగజారి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిలా ఇలా మాట్లాడం సరికాదని హితవు చెప్పారు.
ఇది ప్రజాస్వామ్యానికి కూడా మంచిది కాదని చెబుతూ తన గురించి ఇలా మాట్లాడటం తెలంగాణ సమాజం గమనిస్తోందని హెచ్చరించారు.  “తెలంగాణ కోసం నేను చేసిన పనులకు రేవంత్ రెడ్డి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కేంద్ర మంత్రిగా తెలంగాణ కోసం తీసుకొచ్చిన ప్రాజెక్టులు, నిధులు, అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ ప్రజలకు తెలుసు” అని తెలిపారు.

భారతీయ జనతా పార్టీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ, విశ్వాసమే గత పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించిందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. “తెలంగాణ ప్రజల తీర్పే మాకు సర్టిఫికెట్. తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎనిమిది ఎంపీ స్థానాలు ఇచ్చి తమ విశ్వాసాన్ని చాటారు” అని గుర్తుచేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఒకే రాజకీయ సంస్కృతి ఉందని,  ఒకరినొకరు తిట్టుకోవడం, ఆరోపణలు చేసుకోవడం తప్ప ప్రజల కోసం పనిచేసే అలవాటు రెండు పార్టీలకూ లేదని ధ్వజమెత్తారు.

వీరి రాజకీయాలు కేవలం మాటలకే పరిమితమయ్యాయని పేర్కొంటూ చేతల్లో చూపించాల్సిన అభివృద్ధి, పాలన, ఫలితాల విషయంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. ఈ పార్టీలు ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు వాస్తవాన్ని గుర్తించారని చెప్పారు. 

కాగా, జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. ఐక్యరాజ్యసమితి యోగాను అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించిన గత 12 ఏళ్లుగా పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వ స్థాయిలో దీన్ని నిర్లక్ష్యం చేశారని చెబుతూ గత ప్రభుత్వాల వ్యతిరేక వైఖరి వల్ల అక్కడ యోగాకు ప్రాధాన్యత దక్కలేదని విమర్శించారు. 
 
కానీ ఇప్పుడు అనుకూలమైన వాతావరణం ఉండటంతో, ఈ ఏడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్‌లో జరిగే ప్రధాన యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారని తెలిపారు. గత ఏడాది ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లో జరిగిందని గుర్తు చేశారు.  గత ఐదారు సంవత్సరాలుగా హైదరాబాద్‌లో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. 
 
గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా హైదరాబాద్ లాల్‌బహదూర్ స్టేడియంలో “24 గంటల కౌంట్‌డౌన్ టు యోగా డే” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు.  జూన్ 20న కౌంట్‌డౌన్ కార్యక్రమం ప్రారంభం కాగా, జూన్ 21 ఉదయం 7 గంటలకు ప్రధాన యోగా కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. యోగా అనేది రాజకీయాలకు అతీతమైనదని చెబుతూ ఆరోగ్యం, క్రమశిక్షణ, భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన ఈ యోగా మహోత్సవంలో విద్యార్థులు, యువత, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు సహా అన్ని వర్గాల ప్రజలు కలిసి పాల్గొనాలని ఆయన కోరారు.