కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛమైన నగరాలలో మొదటి 10 నగరాలలో మూడు ఏపీ నగరాలకు చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాలకు చోటు దక్కింది. దేశంలోనే పరిశుభ్రత గల నగరంగా విజయవాడ నాలుగో స్థానం దక్కించుకుంది. తిరుపతి ఆరో ర్యాంకు, విశాఖపట్నం తొమ్మిదో ర్యాంకు సాధించాయి.
స్వచ్చ సర్వేక్షణ్ ర్యాంకులు ప్రకటించే పద్ధతిని 2016 సంవత్సరంలో ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇందులో భాగంగా పరిశుభ్రతను పాటించే 129 అత్యుత్తమ నగరాలు, రాష్ట్రాలకు పురస్కారాలనిస్తారు. తొలి సంవత్సరం దేశంలోనే పరిశుభ్రమైన నగరంగా మైసూరు నిలిచింది. ఆ తర్వాతి ఏడాది ఇండోర్ నగరం ఈ పురస్కారాన్ని దక్కించుకుంది. అప్పటి నుంచి ఇండోర్ వరుసగా నాలుగోసారి మొదటి స్థానంలో నిలవడం విశేషం.
దేశంలో అత్యంత స్వచ్ఛమైన నగరంగా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరం ప్రథమ స్థానంలో నిలిచింది. ఇలా వరుసగా నాలుగో సారి ఇండోర్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం. రెండో స్థానంలో గుజరాత్ లోని సూరత్, మూడో స్థానంలో మహారాష్ట్రలోని ముంబై నిలిచాయి.
కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ‘స్వచ్ఛ సర్వేక్షణ్-2020’జాబితాను ప్రకటించింది. దేశంలో పరిశుభ్రమైన రాష్ట్రాల్లో జార్ఖండ్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానాన్ని దక్కించుకోగా, తెలంగాణ కూడా టాప్ 10 లో చోటు సంపాదించుకుంది.
పరిశుభ్రత విషయంలో ఏపీ ర్యాంక్ గణనీయంగా మెరుగుపడి 28వ ర్యాంక్ నుండి 6వ స్థానానికి చేరుకుంది. కేంద్రం ప్రకటించిన మొత్తం 64 అవార్డుల్లో 6 అవార్డులు రాష్ట్రానికే రావడం విశేషం. టాప్ 100 ర్యాంకుల్లో 72 ర్యాంకులు ఆంధ్రప్రదేశ్ పట్టణాలు కైవసం చేసుకున్నాయి.
టాప్ 10లో ఎనిమిది మున్సిపాలిటీలు రాష్ట్రానివే ఉన్నాయి. విశాఖపట్నం 23 ర్యాంక్ నుంచి 9వ ర్యాంక్‌కు ఎగబాకింది. విజయవాడ 12 నుంచి 4వ ర్యాంక్‌కి, తిరుపతి 8 నుంచి 6వ స్థానానికి చేరుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, జిల్లాలు నాలుగు, ఆరు, తొమ్మిదవ స్థానాలలో చోటు సంపాధించడం ఆనందదాయకమని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్ చేశారు. ఏపీకి వచ్చిన స్థానాల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు ఆయా నగరాల అధికార యంత్రాంగానికి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు.
More Stories
హర్యానాలో బీజేపీ విజయం ఎన్డీయేకు శుభసూచకం
వైజాగ్ స్టీల్‌ప్లాంట్ జఠిలమైన సమస్య
పోలవరంకు కేంద్రం రూ.2,800 కోట్లు విడుదల