ప్రైవేట్ ఆసుపత్రుల రోగులకు అండగా యువమోర్చ

ప్రైవేట్ ఆసుపత్రుల రోగులకు అండగా యువమోర్చ
రాష్ట్రంలో కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు విచ్చలవిడిగా డబ్బులు వసూలు చేస్తున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. పేద వాళ్ళ ఆరోగ్యం పట్ల కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. 
 
అందుబాటులో ఉన్న బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, వివిధ మోర్చా అధ్యక్షులతో జరిపిన సమావేశంలో పేదలు సైతం ప్రైవేట్ హాస్పిటల్ వైపు చూస్తూ ఉండడం జీవితాలు కాపాడుకోవాలన్న ఆశతో ఎన్ని డబ్బులు అయినా కష్టమైనా ఉన్న ఆస్తులు అమ్ముకోవడం, తాకట్టుపెట్టి వైద్యం కోసం పరుగులు పెడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. 
 
దీన్ని అదునుగా చేసుకున్న కొన్ని  ప్రయివేటు యాజమాన్యాలు పీల్చి పిప్పి చేస్తున్నాయని విమర్శించారు. కోర్టులు చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం సరైన దిశలో వ్యవహరించక పోవడం వల్ల బీజేపీ యువ మోర్చా నాయకత్వంలో పోరాటాన్ని చేస్తూ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకునేలా యువ మోర్చా నాయకులు ఆస్పత్రుల వద్ద పేద ప్రజలకు అండగా నిలబడాలని సంజయ్  పిలుపునిచ్చారు. 
 
డాక్టర్ల పట్ల పారామెడికల్ స్టాప్ పట్ల బీజేపీ మొదటినుంచి వారికి మద్దతుగా వారు చేస్తున్న సేవలను గుర్తిస్తూ ప్రజలకు వారి  పట్ల గౌరవ భావంతో ఉండాలని చైతన్యవంతం చేసిందని సంజయ్ గుర్తు చేశారు. 
 
కొన్ని కార్పొరేట్ హాస్పిటల్ లో ప్రైవేట్ హాస్పిటల్ లో ప్రజలకు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మానవతా దృక్పధంతో ఆలోచించాల్సింది పోయి ధనార్జనే ధ్యేయంగా పెట్టుకోవడం చాలా బాధాకరమైన విషయమని పేర్కొన్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నదని ధ్వజమెత్తారు. 
 
పేదల ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం సరైన సమయంలో సరైన విధంగా స్పందించకపోవడం కరోనా వ్యాప్తి విస్తృతమైందని సంజయ్ ఆరోపించారు. మరికొద్ది రోజుల్లోనే కరోనా నిరోధానికి వ్యాక్సిన్ వస్తుందని ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆశిస్తున్నారని చెప్పారు. అలాంటి సమయంలో ఆసుపత్రుల యాజమాన్యాలు మానవతా దృక్పథం తో ఆలోచించాలని సంజయ్ కోరారు. 
 
వైద్యాన్ని ఉచితంగా అందించక పోయినా ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకొని ధనార్జనకు పాల్పడ కూడదని హితవు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వ వైద్యం పట్ల భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరోనా విస్తృతంగా వ్యాపిస్తున్న తరుణంలో, లాక్ డౌన్ సమయంలో ప్రాణాలు సైతం ఫణంగా పెట్టిన డాక్టర్లు పారామెడికల్ స్టాఫ్ పారిశుద్ధ కార్మికుల తదితర సేవలు ఎప్పటికీ మరువలేనివని సంజయ్ కొనియాడారు.