‘‘ఒక పక్క విద్యా సంవత్సరం ప్రారంభం కాలేదని, ఆన్‌లైన్ తరగతులకు అనుమతి లేదని ప్రభుత్వం చెప్తున్నది. మరో పక్క ప్రైవేట్ పాఠశాలలు ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించి , ఫీజుల దోపిడీకి దిగుతున్నాయి. వీటిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యం. అసలు ప్రభుత్వ పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు’’ అని కేసీఆర్ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఎన్ని సార్లు, ఎన్ని అంశాలలపై హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదు. తాజాగా ప్రభుత్వ ఉత్తరువులను బహిరంగంగా ధిక్కరించి ప్రైవేట్ పాఠశాలలు నిలువు దోపిడీ చేస్తున్నా ప్రభుత్వం మౌనంగా ఉన్నదాన్ని హైకోర్టు నిలదీసింది.
విద్యాసంవత్సరం ప్రారంభం కానప్పుడు ప్రైవేట్ పాఠశాలలు ఆన్‌లైన్ తరగతులు ఎలా ప్రారంభిస్తాయని ప్రశ్నించింది. ఆన్‌లైన్ తరగతులతో విద్యార్ధులపై ఎట్లాంటి ప్రభావం ఉందో, ప్రైవేట్ పాఠశాలలలోని ఫీజుల వసూళ్లపై లోతుగా విచారణ చేపట్టాల్సి ఉంటుందని ప్రకటించింది.
హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్‌అసోసియేషన్ వేసిన పిల్‌పై చీఫ్ జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. సీబీఎస్‌ఈ మార్చిలోనే ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించినట్లు చెబుతోందని, మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి విద్యాసంవత్సరం మాటేమిటని హైకోర్టు ప్రశ్నించింది.
రాష్ట్రంలో ఎప్పటి నుంచి విద్యాసంవత్సరం ప్రారంభం అవుతుందో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆన్‌లైన్ తరగతులకు అనుమతి విషయంలో ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే ఇప్పటి వరకూ ప్రైవేట్ పాఠశాలలు వసూళ్లు చేసిన ఫీజుల్ని వెనక్కి ఇచ్చేయాలని తాము ఉత్తరువులు ఇవ్వాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది.
More Stories
ఈడీ విచారణకు కాంగ్రెస్ నేత అజారుద్దీన్
రుణమాఫీపై బహిరంగ చర్చకు రేవంత్ కు ఏలేటి సవాల్!
ముందు చెరువుల్లో దుర్గంధాన్ని తొలగించండి రేవంత్