దసరా నుండి సచివాలయం పనులకు కేసీఆర్ శ్రీకారం 

కొత్త సచివాలయ భవనాన్ని ఏడాది కాలంలోనే సిద్ధం చేయాలన్న లక్ష్యంతో వేగంగా పనులు చేపట్టాలని భావిస్తున్న ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వచ్చే దసరా రోజున పనులు ప్రారంభించాలని నిర్ణయించారు తదుపరి దసరా వరకు పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

సమీకృత కొత్త సచివాలయ నిర్మాణానికి రూ.400 కోట్ల మంజూరు చేస్తూ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర మంత్రివర్గం కొత్త సచివాలయ భవనం తుది నమూనాకు ఆమోద ముద్ర వేసిన మరుసటి రోజే ఈ నిధులను మంజూరు చేశారు. 
 
ఈ మేరకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ పరిపాలనాపరమైన ఉత్తర్వులు జారీ చేయనుంది. అంతేకాక ఒకటి, రెండు రోజుల్లో అధికారులు టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ క్రమంలో అధికారులు చెన్నైకు చెందిన ఆర్కిటెకట్స్ ఆస్కార్, పొన్ని సంస్థ ప్రతినిధులతో భేటీ అయ్యారు.

తదుపరి కార్యాచరణపై అధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. కొత్త సచివాలయ భవనంలో మార్పులు చేర్పులను కెసిఆర్ ఇటీవల వరుస సమీక్షలు నిర్వహించి సూచించిన విషయం తెలిసిందే. ఈ మేరకు నిపుణులు ఖరారు చేసిన తుది డిజైన్‌ను సైతం మంత్రివర్గంలో ఆమోదించారు. 

 
అందరూ పని చేసుకోవడానికి అనుకూలంగా సకల సౌకర్యాలూ ఉండేలా చూడాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కార్యదర్శులు, సలహాదారుల చాంబర్లు అన్ని సౌకర్యాలతో ఉండాలని స్పష్టంచేశారు. 
 
ప్రతి అంతస్తులో భోజనం చేసేందుకు డైనింగ్ హాల్, సమావేశాల కోసం మీటింగ్ హాల్, సందర్శకుల కోసం వెయిటింగ్ హాల్, అన్ని వాహనాలకు పార్కింగ్ వసతి ఉండేలా చూడాలని కెసిఆర్ సూచించిన నేపథ్యంలో నూతన సచివాలయం రాష్ట్ర ప్రతిష్టను పెంచేలా నిర్మాణం జరగనుందని అధికారులు పేర్కొంటున్నారు. 
‘అర్కిటెక్టులు ఆస్కార్, పొన్నితోపాటు ఇంజినీర్స్ సత్యవాణి ప్రాజెకట్స్ అండ్ కన్సల్టేషన్ ఈ డిజైన్‌ను రూపొందించింది. మొత్తం 7 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, 7 అంతస్తుల్లో సచివాలయాన్ని నిర్మించనున్నారు. గతంలో 6 అంతస్తుల్లో నిర్మించాలని భావించినా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని డిజైన్‌లో మార్పులు చేశారు.
తాజా డిజైన్ ప్రకారం 7 అంతస్తులకు పైన భవనం మధ్య భాగంలో సెంట్రల్ టవర్ ఉంటుంది. ఇందులో మరో నాలుగు అంతస్తులు ఉంటాయి. ఒక్కో అంతస్తు 14 అడుగుల ఎత్తుతో ఉంటుంది. సెంట్రల్ టవర్‌పై 48 అడుగుల ఎత్తుతో తూర్పు, పడమరవైపు ‘స్కైలాంజ్’లు నిర్మించనున్నారు. వీటిపైన 50 అడుగుల ఎత్తుతో గుమ్మటం (డోమ్) ఉంటుంది. ఈ డోమ్‌పై 11 అడుగుల ఎత్తుతో జాతీయ చిహ్నాన్ని ఏర్పాటు చేస్తారు.