సింగరేణిలో రూ 1,600 కోట్ల బొగ్గు అదృశ్యంపై దర్యాప్తు జరపండి 

సింగరేణిలో రూ 1,600 కోట్ల బొగ్గు అదృశ్యంపై దర్యాప్తు జరపండి 
 
తెలంగాణ ప్రభుత్వం, భారత ప్రభుత్వం సంయుక్త భాగస్వామ్యం ఉన్న సింగరేణి సంస్థలో దాదాపు రూ.1,600 కోట్ల విలువైన 40 లక్షల టన్నుల బొగ్గు అదృశ్యమైందని ఇటీవల వచ్చిన వార్తాపత్రికల కథనాలపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.   ఈ అంశానికి సంబంధించిన వాస్తవాలను పరిశీలించి, ఆరోపణల్లోని నిజానిజాలపై సమగ్ర విచారణ జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన కోరారు. 
ఇలాంటి వార్తల్లోని నిజానిజాలను పరిశీలించి, తగిన చర్యలు తీసుకోకపోతే సింగరేణి ప్రయోజనాలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ముఖ్యమంత్రికి వ్రాసిన ఓ లేఖలో ఆయన హెచ్చరించారు.  ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.51,500 కోట్లకు పైగా బకాయిల కారణంగా సింగరేణి ఆర్థికంగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్న తరుణంలో, ఇటువంటి వార్తలు సంస్థ ఆర్థిక స్థిరత్వాన్ని మరింతగా దెబ్బతీసే ప్రమాదం ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. 
వీటిని తక్షణమే పరిశీలించి, అవసరమైన చర్యలు చేపట్టకపోతే సింగరేణి ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం పడటమే కాకుండా, సంస్థ భవిష్యత్ అభివృద్ధి, స్థిరత్వానికి కూడా ఆటంకం కలగవచ్చని చెప్పారు.  అదేవిధంగా సింగరేణి సమర్థవంతమైన నిర్వహణ కోసం తగిన సేఫ్ గార్డ్స్, మెకానిజం, ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ సరిగ్గా అమలవుతోందా అనే అంశాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. 
ఈ సమీక్షలో టెక్నాలజీ బేస్డ్ మానిటరింగ్ టూల్స్ వినియోగించడం అవసరమని చెప్పారు.  అలాగే సమయానుగుణంగా సమీక్షలను నిర్వహించడం ద్వారా లోపాలను ప్రారంభ దశలోనే గుర్తించి, వెంటనే పరిష్కరించేందుకు వీలవుతుందని ఆయన సూచించారు. 
ఇటువంటి ప్రయత్నం ద్వారా వ్యవస్థలో ఉన్న లోటుపాట్లను తొలగించడమే కాకుండా, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా నిరోధించడంతో పాటుగా సంస్థ సామర్థ్యం, పారదర్శకత, విశ్వసనీయతను మరింత బలోపేతం అవుతుందని కిషన్ రెడ్డి చెప్పారు. సంస్థ సజావుగా పనిచేయడంలో సంస్థ కోసం ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం విషయంలోనూ ప్రత్యేక చొరవతీసుకోవాలని కేంద్ర మంత్రి ముఖ్యమంత్రిని కోరారు. 
 

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో సింగరేణి పాత్ర కీలకం అని చెబుతూ ఈ సంస్థ ద్వారా 40,000 మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నారని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. అంతేకాకుండా, దేశంలోని బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి గణనీయమైన పాత్ర పోషిస్తూ, దేశ ఇంధన భద్రతకూ విశేషంగా దోహదపడుతోందని చెప్పారు. ఇలాంటి సింగరేణి సంస్థ నిరంతర అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం అనేవి అత్యంత ప్రాధాన్యమైన అంశాలని స్పష్టం చేశారు.