మెగా కృష్ణారెడ్డికి పోతిరెడ్డిపాడు టెండర్లు వచ్చేలా చేయడానికే అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయమని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరారని మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. కృష్ణారెడ్డి ఆర్ధిక ప్రయోజనాలు కాపాడటం తప్పా కేసీఆర్ కు ప్రజలకు న్యాయం చేయాలని గానీ, ఏపీ ప్రాజెక్టులను అడ్డుకోవాలని గానీ లేదని మండిపడ్డారు.
ఏపీ కాంట్రాక్టర్ల మాట విని రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇంత పెద్ద సమస్యను పక్కన పెట్టి సచివాలయం డిజైన్లు, నిర్మాణం గురించి ఆలోచిస్తున్నారని అంటూ దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతున్నా పట్టదా అంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు.
సంగమేశ్వరం, పోతిరెడ్డిపాడు సామర్ధ్యం పెంపుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కేంద్ర జల శక్తిమంత్రికి ఫిర్యాదు చేశారని వివేక్ గుర్తుచేశారు. అప్పుడు కేసీఆర్ ఫౌంహౌస్ లో కూర్చుని సచివాలయం కూల్చివేత, ప్రాజెక్టుల రీ డిజైన్ తో కమీషన్లు ఎలా తీసుకోవాలో ఆలోచిస్తున్నారని ఆరోపించారు.
ఏపీ చర్యలపై అపెక్స్ కౌన్సిల్, పర్యావరణ శాఖ, సెంట్రల్ వాటర్ కమిషన్ అనుమతులు లేవని, అయినా అవేమీ లేకుండానే పనులు మొదలు పెడుతోందని సంజయ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారని వివేక్ గుర్తు చేశారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలని సీఎం కేసీఆర్ కు లేదని ధ్వజమెత్తారు.
‘‘ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్టుల పనులను, జగన్ ను అడ్డుకోవాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్ పై ఉంది. కానీ పోతిరెడ్డిపాడు విషయంలో జగన్ తో కేసీఆర్ కుమ్మక్కయ్యారు. జగన్, మెగా కృష్ణారెడ్డి సలహాలతో కేసీఆర్ ముందుకెళ్తున్నరు”అని వివేక్ ఆరోపించారు.
More Stories
స్థానిక బిసి రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు
సీఎం హామీలకు విలువ లేకుండా పోయింది
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఘోర వైఫల్యం