హనుమాన్ ఆలయం కూల్చవద్దు 

హనుమాన్ ఆలయం కూల్చవద్దు 

యాదగిరిగుట్ట పరిధిలో ఉన్న 200 ఏళ్ల చరిత్ర కలిగిన హనుమాన్ ఆలయం, మర్రి చెట్టును తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం యత్నిస్తోందని తెలంగాణ వానరసేన సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆలయాన్ని కూల్చివేయకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోర్టును కోరింది.

రింగ్‌ రోడ్డు నిర్మాణంలో భాగంగా ఈ ఆలయాలను తొలగించాల్సి వస్తోందని, ఈ మేరకు ఆర్‌అండ్‌బీ శాఖ ఈఈ లేఖ రాశారని ప్రభుత్వ న్యాయవాది నివేదించారు. సంబంధిత ఆర్డీవో నివేదికను కోర్టుకు సమర్పించామని తెలిపారు. 

ఆ నివేదికను పరిశీలించిన హైకోర్టు ధర్మాసనం హనుమాన్ ఆలయం, మర్రిచెట్టు ప్రతిపాదిత రింగ్ రోడ్డుకు అడ్డురాదని నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారని, అలాంటప్పుడు ఆలయాన్ని కూల్చే ప్రశ్నే ఉత్పన్నం కాదు కదా అని ఏజీని ప్రశ్నించింది. 

యాదాద్రి చుట్టూ నిర్మిస్తున్న రింగ్‌ రోడ్డు మ్యాపును, దీనికి సంబంధించి రోడ్లు భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ) ఈఈ రాసిన లేఖనూ సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అరకొర సమాచారంతో ప్రభుత్వం నివేదిక సమర్పించిందని, వాస్తవాలను దాచిపెట్టి వాదనలు వినిపిస్తోందంటూ అసహనం వ్యక్తం చేసింది.

పూర్తి వివరాల సమర్పణకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరడంతో అనుమతిస్తూ విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. అప్పటి వరకు ఆలయం, మర్రిచెట్టును తొలగించరాదంటూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పొడిగించింది.