వైమానిక చరిత్రలో నూతన అధ్యాయం రాఫెల్ 

ఫ్రాన్స్‌కు చెందిన ద‌సాల్డ్ కంపెనీ త‌యారు చేసే రాఫెల్ యుద్ధ విమానాలు చేరుకోవడం భారత వైమానిక చరిత్రలో నూతన అధ్యాయం అని చెప్పవచ్చు. మొత్తం 36 రాఫెళ్ల‌ కొనుగోలుకు భారత్ ఒప్పందం  చేసుకోగా, అయిదు రాఫెల్ విమానాల‌ను అప్ప‌గించారు. 
 
దీంట్లో 30 రాఫెల్ విమానాలు ఫైట‌ర్ జెట్స్ కాగా, మ‌రో ఆరు ట్రైనీ విమానాలు ఉండ‌నున్నాయి.  రూ 60 వేల కోట్ల‌తో రాఫెల్ డీల్ కుదుర్చుకున్నారు. రూ 400 కోట్ల‌తో రాఫెల్ విమానాల మౌళిక స‌దుపాయాల కోసం ఖ‌ర్చు చేశారు. 
 
17వ గోల్డెన్ యారో స్క్వాడ్ర‌న్‌లో ఈ విమానాలు ఉంటాయి. శౌర్య‌చ‌క్ర విజేత కెప్టెన్ హ‌రికీర‌త్ సింగ్ తొలి రాఫెల్‌ను ల్యాండ్ చేస్తారు. 2008లో మిగ్ విమానాన్ని అత్యంత చాక‌చ‌క్యంగా ల్యాండ్ చేయ‌డంలో కెప్టెన్ హ‌రికీర‌త్ కీల‌క పాత్ర పోషించాడు. మిగ్‌లో పేలుడు జ‌రిగినా.. కాక్‌పిట్ నుంచి చీక‌ట్లోనే యుద్ధ విమానాన్ని ల్యాండ్ చేశాడ‌త‌ను. ‌
 
రాఫెల్ యుద్ధ విమానాలు మిస్సైళ్ల‌ను కూడా మోసుకెళ్తాయి.  మెటిరో, స్కాల్ప్ లాంటి క్షిప‌ణ‌ల‌ను అవి ప్ర‌యోగించ‌గ‌ల‌వు. కంటికి క‌నిపించ‌ని దూరంలో ఉన్న టార్గెట్‌ను అవి చేధించ‌గ‌ల‌వు. మెటిరో మిస్సైళ్ల రేంజ్ 150 కిలోమీట‌ర్లు ఉంటుంది. స్కాల్ప్ మిస్సైల్ 300 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను ధ్వంసం చేస్తుంది. 
 
రాఫెల్ యుద్ధ విమానాల్లో టూ సీట‌ర్‌, సింగిల్ సీట‌ర్లు ఉన్నాయి. టూ సీట‌ర్‌ను రాఫెల్ డీహెచ్‌, సింగిల్ సీట‌ర్‌ను రాఫెల్ ఈహెచ్ అని పిలుస్తారు. రెండూ ట్విన్ ఇంజిన్ విమానాలే. ఇవి ఫోర్త్ జ‌న‌రేష‌న్ ఫైట‌ర్ విమానాలు.  డెల్టా వింగ్‌, స్టీల్త్ సామ‌ర్థ్యం వీటికి ఉన్న‌ది. అణ్వాయుధ దాడిలోనూ ఈ యుద్ధ విమానాల‌ను వినియోగించే అవ‌కాశం ఉన్న‌ది.  
 
రాఫెల్ విమానాల్లో సార్ రేడార్లు ఉంటాయి. సింథ‌టిక్ అప‌చ్యూర్ రే‌డార్ సాధార‌ణంగా జామ్ కాదు.  లాంగ్ రేంజ్ టార్గెట్ల‌ను ఈ రేడార్ గుర్తిస్తుంది.  రేడార్ జామ్ కాకుండే ఉండే స‌దుపాయాలు కూడా దీంట్లో ఉన్నాయి. రాఫెల్‌లో ఉన్న రేడార్‌… క‌నీసం 100 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న శ‌త్రు టార్గెట్‌ను గుర్తించ‌గ‌ల‌దు.  
 
ఈ యుద్ధ‌విమానాల్లో ఆధునిక 30ఎంఎం కెనాన్ ఆయుధాలు ఉంటాయి. అవి 125 రౌండ్ల కాల్పులు జ‌ర‌ప‌గ‌ల‌వు. ఈ విమానాలు ఒకేసారి ప‌ది ట‌న్నుల స‌ర‌కుల‌ను మోసుకెళ్ల‌గ‌ల‌వు.   రాఫెల్ విమానాలు హ‌మ్మ‌ర్ అనే మీడియం రేంజ్ మిస్సైళ్ల‌ను కూడా ప్ర‌యోగిస్తాయి.  ఆకాశం నుంచి నేల‌పై ఉన్న టార్గెట్‌ను స్ట్ర‌యిక్ చేస్తాయి. 
 
ల‌డ‌ఖ్ లాంటి ప‌ర్వ‌త ప్రాంతాల్లో ఉన్న బ‌ల‌మైన క‌ట్ట‌డాల‌ను, బంక‌ర్ల‌ను కూడా హ‌మ్మ‌ర్ మిస్సైల్ ధ్వంసం చేయ‌గ‌ల‌దు.