సుశాంత్ సింగ్  ది హత్యే .. స్వామి స్పష్టం 

సుశాంత్ సింగ్  ది హత్యే .. స్వామి స్పష్టం 

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి  పట్లు పలు అనుమానాలు, వివాదాలు చెలరేగుతూ ఉండగా, తాజాగా అతనిది ఆత్మహత్య కాదని, హత్యే అంటూ మాజీ కేంద్ర మంత్రి, బిజెపి ఎంపీ డా. సుబ్రమణియన్ స్వామి కొన్ని ఆధారాలను బైట పెట్టారు.  ఈ ఆత్మహత్య కేసులో సీబీఐ దర్యాప్తుకి కూడా అవకాశం లేదని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ప్రకటించిన తరుణంలోతాజాగా స్వామి ట్వీట్లు సంచలనం రేపుతున్నాయి.

ముంబై పోలీసుల ఎఫ్‌ఐఆర్‌పై పలు సందేహాలని స్వామి  వ్యక్తం చేశారు. తన ఆరోపణలకు మద్దతుగా ఓ పత్రాన్ని ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన సుబ్రహ్మణ్యస్వామి ఇందులో పేర్కొన్న 26 అంశాలలో 24 అంశాలను ఇది హత్యేనని పేర్కొంటున్నాయని స్పష్టం చేశారు. స్వామి ట్వీట్‌ చేసిన పత్రం  ప్రకారం ఆయన పలు వాదనలను ముందుకుతెచ్చారు.

సుశాంత్‌ రాజ్‌పుత్‌ మెడపై ఉన్న గుర్తు ఆత్మహత్యతో సరిపోలడం లేదని, ఇది నరహత్యను సూచిస్తోందని పేర్కొన్నారు. ఈ పత్రం  ప్రకారం సుశాంత్‌ శరీరంపై కొట్టిన గుర్తులు ఉన్నాయని, ఎలాంటి సూసైడ్‌ నోట్‌ లేదని ఇందులో పొందుపరిచారని పేర్కొన్నారు.  ఆత్మహత్యకన్నా ముందు బలవన్మరణానికి పాల్పడిన మేనేజర్‌ దిశా సలియాన్‌కు కొన్ని అంశాలు తెలిసిఉంటాయని చెప్పుకొచ్చారు.  

మరణించిన ప్రదేశంలో సీసీటీవీ ఫుటేజ్ మాయమవడం, అలాగే సుశాంత్ ఉన్న గదికి చెందిన డూప్లికేట్ కీ కనిపించడక పోవడం వంటివి అనుమానాలను బలపరుస్తున్నాయి.  పైగా, సిమ్ కార్డుల మార్పు, సుశాంత్ మేనేజర్ ఆత్మహత్య చేసుకోవడం, పనివాడు తప్పుడు వాంగ్మూలం వంటివి పరోక్షంగా అనుమానాలకు తావిస్తున్నాయని సుబ్రహ్మణ్య స్వామి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

అలాగే అతనికి ప్రస్తుతం ఆర్ధిక సంక్షోభం అంటూ  కూడా ఏమీ లేవు కాబట్టి, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని తెలుస్తుందని స్వామి ప్రకటించారు. అంతే కాదు ముంబై మూవీ మాఫియా ఈ హత్యను ఒక గొడవ కేసుగా చిత్రీకరించి, ఓ నటిని ఇందులో ఇరికించాలని చూస్తున్నట్లుగా స్వామి మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

ముంబై పోలీసులు సుశాంత్‌ కేసులో క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ను అనుసరించారా అని సుబ్రహ్మణ్య స్వామి సందేహం వ్యక్తం చేశారు. సుశాంత్‌ మరణంపై ఆయన బుధవారం బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌తో మాట్లాడారు. సుశాంత్‌ మరణానికి ఆయన మాజీ స్నేహితురాలు‌ రియా చక్రవర్తి వేధింపులే కారణమని ఆరోపిస్తూ సుశాంత్‌ తండ్రి పోలీసులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో స్వామి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

సుశాంత్ సింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని 80 శాతం మంది పోలీసులు కోరుతున్నారని కూడా స్వామి తన ట్వీట్‌లో తెలిపారు. మొత్తంగా చూస్తే స్వామి చెబుతున్న దాని ప్రకారం ఇది ఖచ్చితంగా హత్యే అయి ఉంటుందనేలా అనుమానాలైతే వస్తున్నాయి. స్వామి ట్వీట్స్‌తో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులు ఈ కేసును సీబీఐకి అప్పగించాలని సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ మధ్య ఆయన ప్రేయసి, నటి రియా చక్రవర్తిపై ఈ కేసు విషయమై ఎఫ్ఐఆర్ నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే ఆమె ముంబైలో లేదని, ఎటో వెళ్లిపోయింది అంటూ వార్తలు వచ్చాయి.