టైమ్‌ స్క్వేర్‌‌పై రామమందిరం, రాముడి చిత్రాలు

టైమ్‌ స్క్వేర్‌‌పై రామమందిరం, రాముడి చిత్రాలు
ఆగస్టు 5న అయోధ్య రామమందిరం చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన రోజు. ఆలయం శంకుస్థాపన జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ ఉత్సవాన్ని పురస్కరించుకుని న్యూయార్క్‌లోని టైమ్‌ స్క్వేర్‌‌లో బిల్‌బోర్డ్స్‌ మీద రామాలయం, రాముడి ఫొటోలు, రామనామం, శంకుస్థాపన జరుగుతున్న వీడియోలను 3డీ పోర్ట్‌రైట్స్‌లో ప్రదర్శింపనున్నారు. 
 
అమెరికన్‌ ఇండియా పబ్లిక్‌ అఫైర్స్‌ కమిటీ ఆధ్వర్యంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు జగదీశ్‌ శివ్హనీ తెలిపారు. అయోధ్యలో చరిత్రాత్మక కార్యక్రమం జరగనుందని, అందుకే ఈ సంబరాలు చేస్తున్నామని చెప్పారు. ఆగస్టు 5న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు ఈ డిస్‌ప్లే ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 
 
భారత సంతతికి చెందిన వారు ఆరోజు అక్కడకు చేరుకుంటారని, ‌‌ ఈ సందర్భంగా స్వీట్లు పంచుకుని సంబరాల‌లో పాల్గొంటారని తెలిపారు. “ ఇది చరిత్రలో ఒక్కసారే జరుగుతుంది. దాన్ని ఘనమైన సంబరంగా జరుపుకోవాలి. దానికి ఈ టైమ్‌స్క్వేర్‌‌ ఐకానిక్‌ మంచి ప్రదేశం‌” అని శవ్హనీ వివరించారు.