తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల ఫిర్యాదులను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించేందుకు ముహూర్తం ఖరారుచేసింది. వచ్చేనెల ఐదున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది.
ఈ మేరకు కేంద్ర జల్‌శక్తిశాఖ కార్యదర్శి యూపీ సింగ్ బుధవారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాన్ని నిర్వహించాలని అపెక్స్ కౌన్సిల్ చైర్మన్, కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ నిర్ణయించారని, 5న సీఎంలు అందుబాటులో ఉంటారా లేదా అన్నది సమాచారం ఇవ్వాలని కోరారు.
ఏపీ చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపునకు సంబంధించి కృష్ణాబోర్డుకు తెలంగాణ ఫిర్యాదుచేసిన విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నా అపెక్స్ కౌన్సిల్ భేటీ ఏర్పాటుచేయాల్సిందిగా ఎలాంటి ప్రతిపాదనలను నదీయాజమాన్య బోర్డులు, కేంద్రానికి పంపలేదు.
గతంలో కేంద్ర జల్‌శక్తి ఈ భేటీకి సంబంధించి ఎజెండా అంశాలు కోరినప్పటికీ రెండు రాష్ట్రాలు కూడా పంపలేదు. అయినా ఎజెండాతోపాటు తేదీని ఖరారుచేయడం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది. 2016 ఆగస్టులో సీఎం కేసీఆర్, అప్పటి ఏపీ సీఎం చంద్రబాబుతో నాటి కేంద్రమంత్రి ఉమాభారతి నేతృత్వంలో అపెక్స్ సమావేశం జరగ్గా ఇది రెండోసారి.
అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి కేంద్ర జల్‌శక్తి నాలుగు అంశాలతో అజెండా రూపొందించింది. అయినా డీపీఆర్ ఇవ్వడంపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తున్నది.
1.కృష్ణాబోర్డు, గోదావరి బోర్డు పరిధులను నిర్ణయించడం, 2. అపెక్స్ కౌన్సిల్ పరిశీలన, ఆమోదం కోసం కృష్ణా, గోదావరి బోర్డులకు కొత్త ప్రాజెక్టుల డీపీఆర్‌లను అందజేయడం, 3. కృష్ణా, గోదావరి నదీ జలాలను ఇరు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేయడం, 4. కృష్ణాబోర్డు ప్రధాన కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌కు తరలించడం.
More Stories
వేదాలు భౌతిక, ఆధ్యాత్మిక జ్ఞానపు నిధి
బెంగాల్ పోలీసుల నిర్లక్ష్యంతో కీలక ఆధారాలు నాశనం
మోదీ పుట్టిన రోజుకు బిజెపి కార్యకర్తలకు `ప్రజాస్వామ్య తోఫా’