టిసిఎస్ నాశిక్ కార్యాలయంలో లైంగిక వేధింపులు, మత మార్పిడి ఒత్తిళ్ల వ్యవహారంపై టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలు తనను ఎంతో కలిచివేస్తున్నాయని, వీటిని ఎంతమాత్రం సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపేందుకు టిసిఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆర్తీ సుబ్రమణియన్ నేతృత్వంలో ఒక ఉన్నతస్థాయి విచారణకు ఆయన ఆదేశించారు. పోలీసు దర్యాప్తునకు సంస్థ పూర్తి సహకారం అందిస్తోందని స్పష్టం చేశారు.
ఉద్యోగులు ఏ రూపంలో వేధింపులకు లేదా బలవంతపు చర్యలకు పాల్పడినా ఏమాత్రం సహించేది లేదని చంద్రశేఖరన్ తేల్చిచెప్పారు. విచారణలో దోషులుగా తేలిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా సంస్థలో వ్యవస్థాపరమైన మెరుగుదలకు, దిద్దుబాటు చర్యలను వెంటనే కఠినంగా అమలు చేస్తామని తెలిపారు. ఈ వివాదంపై ఆదివారమే స్పందించిన టీసీఎస్ నిందితులైన అరెస్ట్ అయిన సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది.
కార్యాలయంలో ఉద్యోగుల భద్రత, శ్రేయస్సుకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తామని పేర్కొంది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నాశిక్ కార్యాలయంలో వెలుగుచూసిన లైంగిక వేధింపుల ఆరోపణలు ఐటీ రంగంలో పెను దుమారం రేపాయి. ఈ నేపథ్యంలో ఐటీ రంగ ఉద్యోగుల సంఘం ‘నైట్స్’ కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖను ఆశ్రయించింది. టీసీఎస్ సహా మహారాష్ట్రలోని టెక్, ఐటిఈఎస్ కంపెనీల్లో పోష్ చట్టం అమలుపై సమగ్రమైన ఆడిట్ నిర్వహించాలని కోరింది.
టిసిఎస్ నాశిక్ కార్యాలయంలో పనిచేసే ఎనిమిది మంది మహిళా ఉద్యోగులు సీనియర్ సహోద్యోగులపై ఫిర్యాదు చేశారు. తమను సీనియర్ సహోద్యోగులు మానసికంగా, లైంగికంగా వేధిస్తున్నారని, హెచ్ఆర్ విభాగానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపేందుకు పోలీసులు గత వారమే సిట్ ఏర్పాటు చేశారు. ఈ కేసుకు సంబంధించి టీసీఎస్ మహిళా హెచ్‌ఆర్ మేనేజర్ హెచ్ఆర్ మేనేజర్ నిదా ఖాన్ సహా అసిఫ్ అన్సారీ, షారుఖ్ ఖురేషీ, రజా మేమన్, డానిష్ షేక్, తౌసిఫ్ అత్తర్, షఫీ షేక్ పేర్లు వెలుగులోకి వచ్చాయి. వీరందరినీ అరెస్ట్ చేశారు.
పెళ్లి పేరుతో తనను సహోద్యోగి మోసగించినట్లు ఇటీవల నాశిక్ క్యాంపస్‌లో పని చేస్తున్న ఓ మహిళా ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో మరో ఏడుగురు మహిళా ఉద్యోగులు ముందుకొచ్చి తమకు జరిగిన వేధింపుల గురించి చెప్పారు. వేధింపుల వ్యవహారంలో హెచ్ఆర్ మేనేజర్ సహా ఏడుగురి పేర్లు వెలుగులోకి వచ్చాయి. 2022 ఫిబ్రవరి నుంచి 2026 మధ్య పని ప్రదేశంలో వీరు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు సదరు మహిళా ఉద్యోగులు ఆరోపించారు.
2022-26 మధ్య పని ప్రదేశంలోనే వీరంతా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధిత ఉద్యోగులు పేర్కొన్నారు. అనుచితంగా తాకడం, బాడీ షేమింగ్ చేయడం, అసభ్యకరంగా మాట్లాడటం సహా నాన్ వెజ్ తినాలని ఒత్తిడి చేయడం వంటి ఆరోపణలు ఉన్నాయి. హెచ్ఆర్ విభాగానికి సదరు బాధితులు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలుస్తోంది. దీంతో మహిళా ఉద్యోగుల ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు అండర్ కవర్ ఆపరేషన్ చేపట్టారు.
ఏడుగురు మహిళా పోలీసులు మారు వేషంలో టీసీఎస్ క్యాంపస్‌లోకి ప్రవేశించి అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిని రెడ్ హ్యాండడ్‌గా పట్టుకున్నారు. సీసీటీవీ ఫుటేజీని కూడా పరిశీలించి మిగతా ఉద్యోగుల్ని అరెస్ట్ చేశారు. నాసిక్ టీసీఎస్ కార్యాలయంలో లైంగిక వేధింపుల ఘటనను బీజేపీ తీవ్రంగా ఖండించింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

More Stories
నోయిడాలో హింసాత్మకంగా మారిన కార్మికుల నిరసనలు
భారత్ ‘స్వదేశీ’ జీవన విధానంలో ‘స్వ’ దృక్పధం
హంగేరి ప్రధానిగా వివక్ష నేత పీటర్ మాగ్యార్ ఎన్నిక