గడువుకు ముందే వీసా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి

గడువుకు ముందే వీసా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి

భారత్‌లో వీసా గడువు ముగిసిన తర్వాత కూడా కొంతకాలం అదనంగా ఉండాలనుకునే విదేశీయుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, విదేశీయులు ముందుగానే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం, 180 రోజుల గడువు పూర్తైన తర్వాత కూడా మరో 14 రోజుల సమయం రిజిస్ట్రేషన్ కోసం అందుబాటులో ఉండేది.

అయితే కొత్త నిబంధనలతో ఆ వెసులుబాటును తొలగించారు. ఇకపై 180 రోజులు లేదా అంతకంటే తక్కువ కాలపరిమితి గల వీసాపై భారత్‌కు వచ్చిన విదేశీయులు, ఆ గడువు పూర్తికాకముందే రిజిస్ట్రేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది.  దేశంలో ఉన్న విదేశీయుల వివరాలను మరింత సమర్థంగా పర్యవేక్షించడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా ప్రభుత్వం చెబుతోంది.

ఎక్కువ కాలం చెల్లుబాటు అయ్యే వీసా ఉన్నప్పటికీ, ఒకేసారి 180 రోజుల కంటే ఎక్కువ రోజులు భారత్‌లో ఉండరాదనే నిబంధన ఉన్న విదేశీయులకు కూడా ఈ కొత్త రూల్స్ వర్తిస్తాయి.  ఒకవేళ వారు ఒకే ఏడాదిలో 180 రోజుల కంటే ఎక్కువ కాలం భారత్‌లో ఉండాలనుకుంటే, ముందుగానే రిజిస్ట్రేషన్ చేసి అనుమతి పొందాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇటువంటి అనుమతులు మంజూరు చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది.

తల్లిదండ్రుల్లో ఒకరు లేదా ఇద్దరూ విదేశీయులైన సందర్భాల్లో భారత్‌లో జన్మించిన పిల్లలకు సంబంధించిన నిబంధనల్లో కూడా మార్పులు చేశారు.  గతంలో బిడ్డ పుట్టిన 30 రోజులలోపు ఆన్‌లైన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా అధికారులకు సమాచారం ఇవ్వడం తప్పనిసరి ఉండేది. ఇప్పుడు తల్లిదండ్రుల్లో ఒకరు భారతీయ పౌరుడై, బిడ్డకు భారతీయ పౌరసత్వం ఇవ్వాలని నిర్ణయిస్తే వెంటనే రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపింది.

అయితే ఆ బిడ్డ తర్వాత ఏదైనా ఇతర దేశ పౌరసత్వం పొందితే, ఆ విషయం గురించి 30 రోజులలోపు సంబంధిత అధికారులకు సమాచారం అందించాల్సి ఉంటుంది. విదేశీ పౌరులకు వైద్య సేవలు అందించే ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లకు సంబంధించిన రిపోర్టింగ్ విధానంలో కూడా కొన్ని మార్పులు చేశారు. విదేశీ రోగుల వివరాలను ప్రభుత్వానికి అందించే ప్రక్రియను మరింత ఆధునికీకరించినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మార్పుల ద్వారా దేశంలో విదేశీయుల కదలికలపై మెరుగైన పర్యవేక్షణ, ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.