ప్రధానిని దూషించే వీడియో.. మైనర్ బాలికపై కేసు లేదు

ప్రధానిని దూషించే వీడియో.. మైనర్ బాలికపై కేసు లేదు
గత నెలలో జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీని దూషిస్తూ వైరల్ అయిన వీడియోలో కనిపించిన ఒక మైనర్ బాలికపై కేసు నమోదు చేయకూడదని ఢిల్లీ పోలీసులు నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలువర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నోయిడా పోలీసులు ఆ మైనర్ బాలికపై ‘జీరో’ ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఆ ఎఫ్‌ఐఆర్‌లో ఆమెను 25 ఏళ్ల మహిళగా పేర్కొన్నారు. 
 
అయితే, ఆ తర్వాత విడుదల చేసిన క్షమాపణ వీడియోలో, తనకు కేవలం 15 ఏళ్లు మాత్రమేనని, నిరసన ప్రదేశంలో “ఇతరుల” ప్రభావంతోనే ఆ వ్యాఖ్యలు చేశానని ఆమె స్పష్టం చేసింది.  “నా వయసు కేవలం 15 ఏళ్లు. నేను చేసింది క్షమించరాని పని. నేను చాలా చెడు మాటలు అన్నాను. ఇదే నా మొదటి, చివరి తప్పు. దేశం మొత్తానికి నేను క్షమాపణలు చెబుతున్నాను. నాకు చాలా సిగ్గుగా ఉంది. నా ముఖాన్ని నేనే చూసుకోలేకపోతున్నాను. దయచేసి నన్ను క్షమించండి,” అని ఆమె ఈ వారం ప్రారంభంలో విడుదల చేసిన వీడియోలో పేర్కొంది. 
 
సోషల్ మీడియాలో ఆమె పట్ల ఉదారత చూపాలని విజ్ఞప్తులు వస్తున్న తరుణంలో, తనను దూషించిన “తప్పుదోవ పట్టిన పిల్లలను” క్షమిస్తున్నట్లు ప్రధాని మోదీ గత శుక్రవారం తెలిపారు. “వారిని శిక్షించడం, కోర్టుల చుట్టూ తిప్పడం, వేధించడం వల్ల పరిస్థితులు మారవు. నేను వారిని క్షమించాలనుకుంటున్నాను. నేను చెబుతున్న విషయాన్ని సమాజం కూడా అంగీకరించాలని కోరుతున్నాను,” అని ఆయన ఒక ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో పేర్కొన్నారు. 
 
మరోవంక, ఆ మైనర్ బాలికపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని ఆదేశించాల్సిందిగా ఆమె తల్లి ప్రధాని మోదీని ఆదివారం కోరారు. మైనర్లకు సోషల్ మీడియాను నిషేధించాలని కూడా ఆమె ప్రధాని మోదీని కోరారు.
 
 “18 ఏళ్ల లోపు పిల్లలకు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వినియోగాన్ని నిలిపివేయాలని ప్రధాని మోదీకి నా విన్నపం. వారు కేవలం చదువుకునేందుకే పరిమితం కావాలి. నిరసన ప్రదేశాలకు వెళ్లేందుకు వారికి అనుమతి ఉండకూడదు. ఈ పిల్లలను ఎవరైనా సులభంగా తప్పుదోవ పట్టించి, వారిని తమ ప్రయోజనాల కోసం వాడుకునే అవకాశం ఉంది. వారికి బయటి ప్రపంచం గురించి ఏమీ తెలియదు,” అని ఆమె పేర్కొన్నారు.