యుపిలో ఏ వంట నూనె వాడారో హోటళ్లు చెప్పాల్సిందే

ఉత్త‌ర ప్ర‌దేశ్ ఒక ఆస‌క్తిక‌ర నిర్ణ‌యం తీసుకుంది. రెస్టారెంట్లు, హోట‌ళ్ల‌లో వాడే వంట నూనె గురించి వినియోగ‌దారుల‌కు త‌ప్ప‌నిస‌రిగా వెల్ల‌డించాల్సిందే. ఈ మేరకు ఉత్త‌ర ప్ర‌దేశ్ ఫుడ్ సేఫ్టీ అండ్ డ్ర‌గ్ అడ్మినిస్ట్రేష‌న్ (ఎఫ్ఎస్‌డీఏ) ఆదేశాలు జారీ చేసింది. అలాగే, ఆహార భ‌ద్ర‌త విష‌యంలో ఇంకొన్ని సేఫ్టీ రూల్స్‌ను కూడా ఎఫ్ఎస్‌డీఏ సూచించింది.  దీని ప్ర‌కారం ఇక‌పై ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని అన్ని హోట‌ళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, ఇత‌ర ఆహార త‌యారీ సంస్థ‌లు ఏవైనా తాము ఏ నూనెతో ఆహారం త‌యారు చేస్తున్నాయో త‌ప్ప‌నిస‌రిగా వెల్ల‌డించాల్సిందే.
దీనివ‌ల్ల వినియోగ‌దారుల‌కు తాము తినే ఆహారంపై ఒక స్ప‌ష్ట‌త వ‌స్తుంది. మెనూలోని ప్ర‌తి ఐటంకు సంబంధించి నూనె వివ‌రాల్ని తెలపాలి.  అలాగే, కిచెన్ హైజీన్ గురించి కూడా క‌స్ట‌మ‌ర్ల‌కు తెలియ‌జేయాలి. ఏమైనా స‌మ‌స్య‌ల‌పై ఫిర్యాదు చేసేందుకు ఒక క్యూఆర్ కోడ్‌ను రూపొందించాలి. దీన్ని స్కాన్ చేయ‌డం ద్వారా వినియోగ‌దారులు ఫిర్యాదు చేసేందుకు వీలు క‌ల్పించాలి. అలాగే, ఆ రికార్డుల్ని భ‌ద్ర‌ప‌ర‌చాలి. సెంట్ర‌ల్ బోర్డ్ లైసెన్స్ క‌లిగిన హోట‌ళ్లు, 10కంటే ఎక్కువ హోట‌ళ్లు నిర్వ‌హించే సంస్థ‌లు త‌ప్ప‌నిస‌రిగా మెనూ కార్డ్ పాటించాలి. 
 
వెజిటేరియ‌న్, నాన్ వెజిటేరియ‌న్ ఫుడ్ గురించి ప్ర‌త్యేకంగా వివ‌రించాలి. ఈ మెనూలో వంట నూనె వివ‌రాల‌తోపాటు ఫుడ్ క‌ల‌ర్స్, స్వీటెన‌ర్స్, అల‌ర్జీ క‌లిగించే ప‌దార్థాల గురించి కూడా ఉండాలి. నిషేధిత రంగుల్ని, హానికర ప‌దార్థాల్ని వంట‌లో వాడ‌రాదు. ఆహార ప‌దార్థాల్లో ర‌సాయ‌నాలు, లిక్విడ్ నైట్రోజ‌న్ కూడా నిషేధ‌మే. ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్, ఫుడ్ సేఫ్టీ క‌నెక్ట్ క్యూఆర్ కోడ్‌ను మెనూలో పొందుర‌చాలి.రిఫ్రిజ‌రేట‌ర్లు, డీప్ ఫ్రీజ‌ర్లలో త‌గినంత టెంప‌రేచ‌ర్ మెయిన్‌టైన్ చేయాలి. ఏ ప‌దార్థాన్ని ఎప్పుడు త‌యారు చేశార? ఎప్పుడు ఫ్రీజ‌ర్‌ల‌లో ఉంచారు? వంటి విష‌యాల‌పై రికార్డు మెయిన్‌టైన్ చేయాలి. కిచెన్‌ల‌లో త‌గిన వెంటిలేష‌న్, లైటింగ్ ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి అనేక నిబంధ‌న‌ల్ని హోట‌ళ్లు, రెస్టారెంట్లు, దాబాలు, క్లౌడ్ కిచెన్స్ వంటివ‌న్నీ క‌చ్చితంగా పాటించాల్సిందే అని యూపీ ప్రభుత్వం ఆదేశించింది.

About The Author