* తెలంగాణకు ఇవాళ, రేపు, ఎల్లుండి వర్ష సూచన
దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజా అంచనాల ప్రకారం జూన్ 4న కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉంది. సాధారణంగా జూన్ ఒకటో తేదీ నాటికి నైరుతి కేరళను తాకుతుంది. దీంతో వర్షాకాలం మొదలవుతుంది. అయితే ప్రస్తుతం మబ్బుల రాక ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.
జూన్ 4వ తేదీ వరకు కేరళ, తమిళనాడు, అరేబియా సముద్రం, లక్షద్వీప్‌తో పాటు మరికొన్ని ప్రాంతాలకు నైరుతి చేరుకునే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ అంచనా వేసింది. రుతుపవనాల రాకతో దక్షిణ భారత రాష్ట్రాల్లో వచ్చే ఆరు నుంచి ఏడు రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా కేరళలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
కొన్ని ప్రాంతాల్లో 7 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అరేబియా సముద్రం మీదుగా తేమతో కూడిన గాలులు బలపడుతుండటంతో రుతుపవనాల కదలిక వేగవంతమవుతోంది. దీని ప్రభావంతో కేరళతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది. అయితే రుతుపవనాల ప్రారంభంతో పాటు పలు ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలోని వాయువ్య, మధ్య, తూర్పు ప్రాంతాలతో పాటు దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఈదురుగాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని అంచనా వేసింది. దీంతో విద్యుత్ స్తంభాలు, తాత్కాలిక నిర్మాణాలు, వ్యవసాయ పంటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక అధికారుల సూచనలు పాటించాలని సూచించింది. ఉత్తరాదిలోని డిల్లీ- ఎన్‌సీఆర్, రాజస్థాన్, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో ఇటీవల నమోదైన తీవ్ర ఎండల నుంచి ఉపశమనం కొనసాగనుంది.
ఆ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గత కొన్ని రోజులుగా అక్కడ గరిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినట్లు తెలిపింది. అదేవిధంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి మధ్య భారత రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తూర్పు భారతదేశంలోని బిహార్, ఝార్ఖండ్, బంగాల్లో రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కాగా, వాతావరణ శాఖ మొదటగా మే 26 నాటికే నైరుతి రుతుపవనాలు వస్తాయని అంచనా వేసింది. అయితే వాతావరణ అననుకూల పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం వల్ల రుతుపవనాల రాక ఆలస్యం అయింది. ఇప్పటికే ఈ ఏడాది వర్షపాతం దీర్ఘకాలిక సగటులో కేవలం 90 శాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది. వర్షపాతం తగ్గడం వల్ల వ్యవసాయాధారిత రైతులపై దాని ప్రభావం తీవ్రంగా పడుతుంది.

More Stories
మమతాకు ముఖం చాటేసిన టిఎంసి ఎంపీలు, ఎమ్యెల్యేలు
విజయవంతంగా రుద్రమ్-2 క్షిపణి ప్రయోగం
అమరవీరుల కలలు కన్న తెలంగాణ నిర్మాణంలో వెనుకబడ్డాం